నిజామాబాద్, ఆగష్టు 4
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : అవసరం మేరకు జిల్లాలో యూరియా ఎరువు అందుబాటులో ఉన్నప్పటికీ సమాచార లోపం వల్ల కొన్నిచోట్ల ఎరువుల కొరతపై రైతులు ఆందోళనకు గురయ్యారని, జిల్లాలో యూరియా కొరత లేదని ఎప్పటికప్పుడు ముందుగానే ఎరువులు తెప్పిస్తున్నామని రైతులు ఆందోళన చెందకుండా అందుబాటులో ఉన్న చోట అధికారులను సంప్రదించి యూరియాను పొందాలని జిల్లా కలెక్టర్ నారాయణ రెడ్డి రైతులకు సూచించారు.
బుధవారం ఆయన సెల్ కాన్ఫరెన్సు ద్వారా సంబంధిత అధికారులతో ఎరువుల కొరత, లభ్యతపై స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. జిల్లాలో మంచి వర్షాలు పడడం ఆ తర్వాత రైతులు వ్యవసాయ పనులు పెద్ద ఎత్తున మొదలుపెట్టడంతో ఒక్కసారిగా యూరియా అవసరం ఏర్పడిరదని అయితే ఈ విషయాన్ని ముందుగానే దృష్టిలో ఉంచుకొని యంత్రాంగం అవసరమైన యూరియాను అడ్వాన్స్‌గా తెప్పించి ఉంచడం జరిగిందని ఆ దిశగా పంపిణీ కూడా జరుగుతుందని తెలిపారు.
కొన్నిచోట్ల యూరియా దొరుకుతుందో లేదో అన్న భయంతో కొందరు ఒకేసారి కొనుగోలు చేయడంతో అక్కడక్కడ ఇబ్బందులు ఏర్పడ్డాయని కానీ జిల్లాలో యూరియాకు ఎంతమాత్రం కొరత లేదని, రైతులు ఈ విషయంలో ఎటువంటి ఆందోళనకు గురి కావాల్సిన అవసరం లేదని తెలిపారు.
ఈ విషయమై జిల్లాకు చెందిన మంత్రివర్యులు రాష్ట్ర రహదారులు భవనాలు, శాసనసభ వ్యవహారాల శాఖామాత్యులు వేముల ప్రశాంత్ రెడ్డి తనతో ఉదయం ఫోన్ ద్వారా మాట్లాడి ఎరువుల లభ్యతపై వివరాలు తెలుసుకున్నారని, సమస్య ఉంటే తన దృష్టికి తీసుకురావాలని తెలిపారని అదేవిధంగా రైతులకు ఎరువుల ఇబ్బంది రాకుండా చూడవలసిందిగా పర్యవేక్షణ చేయవలసినదిగా ఆదేశించారని తెలిపారు. రైతులందరికీ ఎరువులు అందే విధంగా చూడాలి అన్నారని పేర్కొన్నారు.
సహకార సంఘాలకు, ప్రైవేటు డీలర్లకు, ఆగ్రోస్‌కు సరఫరా చేసే ఎరువుల వివరాలు, అదే విధంగా వారి వద్ద అందుబాటులో ఉన్న వివరాలు కూడా ప్రతిరోజు రైతులకు తెలిసేవిధంగా చూడాలని, మీడియా ద్వారా కూడా ప్రజలకు తెలియ చేయాలని ఆయన అధికారులను ఆదేశించారు. ఈ దిశగా వ్యవసాయ అధికారులు, తహసిల్దార్లు సహకార సంఘాలు ప్రైవేటు డీలర్ల వద్దకు వెళ్లి వారికి చేస్తున్న సరఫరాకు, వారి ద్వారా విక్రయించిన వివరాలు, అందుబాటులో ఉన్న దానికి సరిచూసుకొని సక్రమంగా రైతులకు పంపిణీ జరిగే విధంగా పర్యవేక్షణ చేయాలని స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు.
అంతేకాక పంపిణీ కేంద్రాల వద్ద ఎరువులు పూర్తిగా అయిపోయేంత వరకు ఆగకుండా ముందుగానే అంచనా వేసుకొని ఇండెంట్ పంపించి ఎప్పటికప్పుడు ఇబ్బంది లేకుండా, కొరత లేకుండా, రైతులకు అందించడానికి సరైన పర్యవేక్షణ చేయాలని పేర్కొన్నారు. అంతేకాకుండా ఒకేసారి కాకుండా అవసరం మేరకు విడతలవారీగా తీసుకునే విధంగా రైతులకు అవగాహన కల్పించాలన్నారు.
అదనపు కలెక్టర్ చంద్రశేఖర్ ఈ విషయంలో ప్రత్యేకంగా పర్యవేక్షణ చేయడంతోపాటు జిల్లాకు ఎరువులతో వచ్చే రైల్వే వ్యాగన్ల వివరాలను ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ రాష్ట్ర స్థాయి అధికారులతో సమన్వయం చేసుకుంటూ రైతులకు సమస్యలు ఉత్పన్నం కాకుండా చూడాలని తెలిపారు.
జిల్లా వ్యవసాయ అధికారి, జిల్లా సహకార అధికారి, ఈ విషయంలో జిల్లా స్థాయిలో ఎప్పటికప్పుడు పర్యవేక్షణ చేస్తూ ఎక్కడ కూడా సమస్య రాకుండా చూడాలన్నారు.
యూరియా వివరాలు :
బుధవారం సహకార సంఘాలకు 640 మెట్రిక్ టన్నులు, ప్రైవేటు డీలర్లకు 640 మెట్రిక్ టన్నులు, ఆగ్రోస్కు 320 మెట్రిక్ టన్నులు పంపిస్తున్నామన్నారు. అదేవిధంగా 1600 మెట్రిక్ టన్నులతో బుధవారం, 1200 మెట్రిక్ టన్నులతో గురువారం, 1642 మెట్రిక్ టన్నులతో శుక్రవారం రైల్వే వ్యాగన్ల ద్వారా ఎరువులు రానున్నాయని వివరించారు.
కావున జిల్లాలోని రైతులు యూరియా కొరకు ఎట్టి పరిస్థితుల్లో కూడా ఆందోళన చెందకుండా వ్యవసాయ అధికారుల ద్వారా ఎక్కడ అందుబాటులో ఉందో తెలుసుకొని ఎరువులు పొందాలని కోరారు. ఈ దిశగా జిల్లా యంత్రాంగం ఎట్టి పరిస్థితుల్లో రైతులకు ఇబ్బంది రాకుండా అవసరమైన అన్ని జాగ్రత్త చర్యలు తీసుకుంటుందని పేర్కొన్నారు.
సెల్ కాన్ఫరెన్సులో అదనపు కలెక్టర్ చంద్రశేఖర్, జిల్లా వ్యవసాయ అధికారి గోవిందు, జిల్లా సహకార అధికారి సింహాచలం, ఆర్‌డివోలు రాజేశ్వర్, రవి, శ్రీనివాస్, మండల వ్యవసాయ అధికారులు, తహసీల్దార్లు, తదితరులు, పాల్గొన్నారు.