నిజామాబాద్, ఆగష్టు 5
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు జిల్లా వైద్య, ఆరోగ్యశాఖ ఆధ్వర్యంలో వివిధశాఖలు, స్థానిక సంస్థల ఆధ్వర్యంలో కొనసాగుతున్న ఇంటింటి సమగ్ర కుటుంబ ఆరోగ్య సర్వే జిల్లాల్లో ఆశాజనకంగా కొనసాగుతున్నట్లు జిల్లా వైద్య, ఆరోగ్య శాఖాధికారి డా. బాల నరేంద్ర తెలిపారు. ప్రతివ్యక్తి యొక్క వ్యక్తిగత ఆరోగ్యాన్ని బలపరుస్తూ, కుటుంబ ఆరోగ్యాన్ని పెంపొందించినప్పుడే, సామాజిక ఆరోగ్యంతో పాటు ఆరోగ్యవంతమైన సమాజం ఏర్పడుతుందన్నారు.
కోవిడ్ సమయంలో మూడోదశ రాబోతుందంటున్న సమయంలో, సీజనల్ వ్యాధులు ప్రబలే ఈ కాలంలో, కోవిడ్‌తోపాటు మిగతా వ్యాధులు క్షయ, కుష్టు, ఎయిడ్స్, డయాలసిస్, తలసీమియా లాంటి వ్యాధుల లక్షణాలను గుర్తించి ముందస్తు చికిత్స అందించడం వల్ల వ్యాధి ఉద్ధృతిని ప్రారంభదశలోనే కట్టడి చేసి, వ్యాధి తీవ్రతను తగ్గించడానికి ఇది దోహదం చేస్తుందన్నారు. ఆగస్టు మూడవ తేది నుండి కొనసాగుతున్న ఆరోగ్య సర్వే వారం రోజులపాటు, ఆరోగ్య సమాచారంతో కూడిన యాప్‌లో ఆశాకార్యకర్తలు, అంగనవాటి టీచర్లు ఇంటింటికి వెళ్లి చేయడం జరుగుతుందన్నారు.
సర్వేలో స్థానిక సంస్థల అధికారులు, ఆరోగ్య సర్వే స్పెషల్ ఆఫీసర్లు, ఆరోగ్య పర్యవేక్షక సిబ్బంది, స్థానిక వైద్యాధికారులు, జిల్లా ఉప వైద్య ఆరోగ్యశాఖాధికారులు, జిల్లా అదనపు వైద్యాధికారి డాక్టర్ సుదర్శనం ప్రతి రోజు క్షేత్ర స్థాయిలో పర్యవేక్షించడం జరుగుతుందన్నారు. కావున గ్రామ, పట్టణ స్థాయిలో వార్డు సభ్యులు, కౌన్సిలర్లు, సర్పంచ్‌లు, మున్సిపల్ కార్పొరేటర్లు, ఎంపిటిసిలు, జడ్పిటిసిలు, మండలాద్యక్షులు (ఎంపిపి) స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులందరు ఇంటింటి సమగ్ర కుటుంబ ఆరోగ్య సర్వేకు మీ వార్డు, మీగ్రామం, మీ పట్టణంలో సహకరించి, సర్వేను విజయవంతం చేయటానికి ప్రజలకు అవగాహన కల్పించాలన్నారు.
విధుల్లో, సర్వేలో ఏ మాత్రం నిర్లక్ష్యం వహించిన సిబ్బందికి జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు శాఖాపరమైన చర్యలు తీసుకోవడం జరుగుతుందని, అదేవిధంగా ప్రజలంతా ఆరోగ్య సర్వేకు సహకరించి జిల్లాను ఆరోగ్య వంతమైన జిల్లాగా మార్చాలన్నారు.