ఆర్మూర్, ఆగష్టు 6
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : తెలంగాణా రాష్ట్ర వ్యాప్తంగా శుక్రవారం నుండి ఉచిత నట్టల నివారణ మందు వేసే కార్యక్రమం ప్రారంభమైందని, ఇందులో భాగంగా ఆర్మూర్ మండలం మచ్చర్ల గ్రామంలో ఆర్మూర్ మండల ఎంపీపీ పస్క నర్సయ్య జీవాలకు నట్టల నివారణ మందులు వేసి కార్యక్రమాన్ని ప్రారంభించారని మండల పశుసంవర్ధకశాఖ అధికారి డాక్టర్. లక్కం ప్రభాకర్ అన్నారు.
మచ్చర్ల గ్రామ జీవాల పెంపకందారులు చాలా ఉత్సాహంగా పాల్గొని తమతమ జీవాలకు పశువైద్య సిబ్బంది ద్వారా నట్టల నివారణ మందులు తాగించారు. ఇదే కార్యక్రమం శనివారం దేగాం, మిర్దాపల్లి గ్రామాల్లో కొనసాగుతుందని, కావున ఆయా గ్రామాల జీవాల పెంపకందారులు ఇట్టి కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా విజ్ఞప్తి చేశారు.
జీవాలు మేత మేసే విధానం వల్ల జీవాల కడుపులో క్రమేపీ నట్టలు ఏర్పడుతూ ఉంటాయని, ఈ విధంగా జీవాల కడుపులో ఏర్పడిన నట్టలలో కొన్ని జీవాల ప్రేగులకు అతుక్కుని, మరికొన్ని కడుపులోనే ఉండి జీవాల రక్తాన్ని త్రాగి బ్రతుకుతూ జీవాలు బలహీన పడేలా చేస్తాయని, తద్వారా బలహీనపడ్డ జీవాలు, మాంసోత్పత్తిలో వెనకబడిపోతాయన్నారు.
అలా బలహీన పడ్డ జీవాలలో పునరుత్పత్తి శక్తి తగ్గిపోయి, జీవాల పెంపకం దారులకు ఆర్థిక నష్టం కలగజేస్తాయని పేర్కొన్నారు. కాబట్టి క్రమం తప్పకుండా నట్టల నివారణ మందులను జీవాలకు తాగిపించి, జీవాల ఆరోగ్యాన్ని కాపాడుతూ, గొల్ల కురుమ సోదరుల ఆర్థిక పరిపుష్టికి దోహదపడుతూ… అంతిమంగా నాణ్యమైన మాంసాన్ని ఉత్పత్తి చేసి, ప్రజల ఆరోగ్యాన్ని కాపాడే ఈ కార్యక్రమాన్ని జీవాల పెంపకందారులందరూ సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.
కార్యక్రమంలో పశువైద్య సిబ్బంది, రాధ, సురేష్, నర్సయ్య, నాగార్జున, శ్రీనివాస్ పాల్గొని మచ్చర్ల గ్రామంలో ఉన్న జీవాలకు నట్టల నివారణ మందులను తాగిపించారు.