నిజామాబాద్, ఆగష్టు 6
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ఈ నెల 3 నుండి జిల్లాలో చేపట్టిన హెల్త్ సర్వే రెండు రోజుల్లో పూర్తి కానుందని, ప్రజలు మంచి సహకారం అందిస్తున్నారని జిల్లా కలెక్టర్ నారాయణ రెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు.
జిల్లా ప్రజలు ఎదుర్కొంటున్న ఆరోగ్య సమస్యలను సర్వే ద్వారా పూర్తిస్థాయిలో తెలుసుకొని వారికి అవసరమైన చికిత్సలు అందించడానికి జిల్లాలో కోవిడ్, టీబి, లెప్రసీ, తలసేమియా, డయాలసిస్, హెచ్‌ఐవి వ్యాధులపై ఆరోగ్య కార్యకర్తలు ఇంటింటికి తిరిగిఈ నెల 3 నుండి సర్వే నిర్వహిస్తున్నారని తెలిపారు. మూడు రోజులపాటు నిర్వహించిన సర్వేలో 62 శాతం వివరాల సేకరణ పూర్తి అయ్యిందని జిల్లాలో మూడున్నర లక్షల కుటుంబాలను 2 లక్షల 17 వేల కుటుంబాలలో సర్వే సేకరించామని తెలిపారు.
సర్వేలో 1990 కోవిడ్ అనుమానిత 82 పాజిటివ్ కేసులు, టిబి 387 అనుమానిత 254 కేసులు సర్వేలో తేలగా లెప్రసి 52 సస్పెక్టెడ్ కాగా, 73 మందికి ఈ వ్యాధి ఉన్నట్లు తెలిసిందని 39 మందికి తలసేమియా లక్షణాలు ఉన్నట్లు 55 మందికి వ్యాధి ఉన్నట్లు డయాలసిస్ 42 మందికి లక్షణాలు ఉన్నట్లు తేలగా 190 మంది వ్యాధితో బాధపడుతున్నట్లు అదేవిధంగా హెచ్‌ఐవి 31 మందికి లక్షణాలు కాగా 548 మందికి వ్యాధి సోకినట్లు సర్వేలో తెలిసిందని వివరించారు.
సర్వే సందర్భంగా ఇంటింటికి వెళ్లిన ఆరోగ్య కార్యకర్తలకు ప్రజలు పూర్తిస్థాయిలో సహకరిస్తున్నారని తద్వారా వ్యాధి ఉన్నవారు, లక్షణాలు ఉన్న వారి వివరాలతో పూర్తిస్థాయిలో పరీక్షలు నిర్వహించి వారికి అవసరమైన మందులు, చికిత్సలు అందించడానికి వీలు కలుగుతుందని కలెక్టర్ పేర్కొన్నారు.
తమ ఇంటికి వచ్చే ఆరోగ్య కార్యకర్తలకు ప్రజలు వారి కుటుంబ సభ్యులకు సంబంధించి ఆరోగ్య సమస్యలపై పూర్తి సమాచారాన్ని దాచుకోకుండా అందిస్తే వారికి జిల్లా యంత్రాంగం తదుపరి చికిత్సలు సిఫార్సు చేయడానికి అవకాశం కలుగుతుందని, అంతేకాక జిల్లాలో కరోనాను ఎదుర్కోవడానికి ముందస్తు చర్యలు తీసుకోవచ్చునని దానితోపాటు పైన తెలిపిన వ్యాధులపై సత్వర చర్యలు తీసుకోవడానికి వీలవుతుందని ఆయన సూచించారు.