నిజామాబాద్, ఆగష్టు 6
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ప్రొఫెసర్ జయశంకర్ సార్ ఆశయాలు, సిద్ధాంతాలకు అనుగుణంగా ముందుకు వెళ్దామని జిల్లా కలెక్టర్ సి నారాయణ రెడ్డి, నగర మేయర్ నీతూ కిరణ్ పిలుపునిచ్చారు.
ప్రొఫెసర్ జయశంకర్ సార్ 87వ జయంతి సందర్భంగా బీసీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో కార్యక్రమాలు ఏర్పాటు చేయగా శుక్రవారం కంఠేశ్వర్‌లో గల ఆయన విగ్రహానికి పూలమాలవేసి వారిరువురు ఘనంగా నివాళులు అర్పించారు. అనంతరం కలెక్టరేట్ ప్రగతి భవన్ సమావేశ మందిరంలో జయంతి కార్యక్రమాన్ని నిర్వహించారు.
కలెక్టర్, మేయర్‌తో పాటు అధికారులు ఉద్యోగులు పాల్గొనగా జ్యోతి ప్రజ్వలన గావించి చిత్రపటానికి పూల మాలలు వేసి నివాళులర్పించారు. నగర మేయర్ నీతూ కిరణ్ మాట్లాడుతూ సారు అనే పదానికి ఒక గొప్ప విలువ తీసుకువచ్చినటువంటి వ్యక్తి జయశంకర్ సార్ అన్నారు. తెలంగాణ కోసం తనదైన శైలిలో ముందుకు సాగినటువంటి వ్యక్తి ప్రొఫెసర్ జయశంకర్ సార్ అని, ఆయనకు ఊహ తెలిసినప్పటి నుంచి చనిపోయే రోజు వరకు కూడా ఆయన శ్వాస, ధ్యాస తెలంగాణ రాష్ట్రం కావాలని ప్రతి ప్రసంగంలో కూడా తెలంగాణ రాష్ట్రం గురించి మాట్లాడేవారని కేవలం తెలంగాణ రాష్ట్రం కావాలని ఆశయంగా పెట్టుకున్నారని అన్నారు.
రాష్ట్ర ప్రజలు తన బిడ్డలుగా ప్రతి ఒక్కరిలో స్ఫూర్తి నింపిన వ్యక్తి, ఉద్యమంలో కేసీఆర్‌కు ఎంతో మేలు చేస్తూ సలహాలు సూచనలు ఇస్తూ ముందుకు తీసుకు వెళ్లిన వ్యక్తి జయశంకర్ సార్ అన్నారు.
జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ఆయన ఆశయాలు సిద్ధాంతాలతో ముందుకు వెళ్లాల్సిన అవసరం ఎంతైనా ఉందని అన్నారు. మాన్యులు పెద్దలు మన తెలంగాణ సిద్ధాంతకర్త ప్రొఫెసర్ జయశంకర్ సార్ జయంతి ఉత్సవాలు అధికారికంగా జరుపుకోవడం సంతోషదాయకమని తెలంగాణ వస్తే ఏమి వస్తుందని 1952-1969 ఉద్యమంలోనే చూసిన వ్యక్తి జయశంకర్ సార్ అని, తెలంగాణ ప్రాంతంలో అభివృద్ధి జరగాలంటే ప్రత్యేక రాష్ట్రం అనేది చాలా అవసరమని, ఈ ప్రాంతంలో ఉన్న నీళ్ళ పంపకాలు అనేవి చాలా ముఖ్యమైన అంశమని, తెలంగాణ తొలి ఉద్యమంలో గుర్తించిన వ్యక్తి ఆయనే అన్నారు.
వారి ప్రసంగంలో తెలంగాణలో అప్పుడున్న నీళ్లు, నిధులు, నియమకాలు అనే కాన్సెప్ట్ ఎంతో చక్కగా వివరించేవారు. ఆయన ప్రసంగం వింటే మనకు తెలంగాణ భవిష్యత్తు కళ్ళముందే కనిపించేదని, ఈ రోజు ప్రత్యేకంగా చూస్తున్నామని నీళ్ళు వస్తే ఏ విధంగా అభివృద్ధి చెందుతుందనే కాకతీయులు గొలుసుకట్టు చెరువులు తవ్వించారో వాటిని పునరుద్ధరించు కోవడం వల్ల ప్రతి ప్రాంతంలో ఎంతో కొంత పంటలు పండే అవకాశం ఏర్పడిరది అన్నారు.
తెలంగాణ వస్తే ఎలా ఉంటుందో ముందు ఊహించిన వ్యక్తి జయశంకర్ సార్ అని, దానిని మనము ఇప్పుడు చూస్తున్నామన్నారు. ఏ ఊర్లో చూసిన చెరువులో నీళ్ళు ఫుల్ గా ఉండాలి, ఎండాకాలం కూడా చెరువుల్లో నీళ్లు కనబడుతున్నాయని, జయశంకర్ సార్ తెలంగాణ రాష్ట్రాన్ని చూసి ఉంటే బాగుండేదని, నేను కలలుగన్న రాష్ట్రం ఏర్పడిరదని భావించేవారని వారి ఆశయాలు వారు కలలుగన్న తెలంగాణ ఏర్పడినందుకు ఎంతో సంతోషించే వారని పేర్కొన్నారు.
కార్యక్రమంలో అడిషనల్ కలెక్టర్ చిత్రా మిశ్రా, మున్సిపల్ కమిషనర్ జితేష్ వి పాటిల్, గ్రంధాలయ చైర్మన్ రాజేశ్వర్, బిసి వెల్ఫేర్ అధికారి రమేష్, వినియోగదారుల సమాచార కేంద్రం చైర్మన్ రాజేశ్వర్, బీసీ సంఘం ప్రతినిధులు, ఆంజనేయులు, శ్రీనివాస్ గౌడ్, సుధాకర్, బీసీ సంఘాల నాయకులు కుల సంఘాల నాయకులు అధికారులు, తదితరులు పాల్గొన్నారు