నిజామాబాద్, ఆగష్టు 7
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ఈ నెల 10వ తేదీన బాల అదాలత్ ఓపెన్ బెంచ్ నిర్వహించనున్నామని, బాలల హక్కుల పరిరక్షణకు సంబంధించిన కమిషన్ పర్యటించనున్నారని జిల్లా కలెక్టర్ నారాయణ రెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు.
18 సంవత్సరాల లోపు పిల్లలకు సంబంధించి వారి హక్కులు, విద్య, ఇతర సమస్యలకు సంబంధించి వినతులు స్వీకరించడానికి, విచారణ జరపడానికి తెలంగాణ రాష్ట్ర బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ ఏడుగురు సభ్యులు చైర్ పర్సన్ శ్రీనివాసరావు ఆధ్వర్యంలో ఈనెల 10న జిల్లాలో పర్యటించి కార్యక్రమాలలో పాల్గొననున్నారని ఆయన తెలిపారు.
ఈనెల 10న వారు కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో ఉదయం 10.30 గంటలకు ఏర్పాటు చేసే కార్యక్రమంలో పాల్గొని పిల్లల హక్కులకు సంబంధించి వారి తల్లిదండ్రులు, పోషకుల నుండి దరఖాస్తులు స్వీకరిస్తారని వచ్చిన ఫిర్యాదులపై విచారణ జరిపి సంబంధిత శాఖల అధికారులకు ఆదేశాలు జారీ చేస్తారని తెలిపారు.
పోలీస్, రెవెన్యూ, స్త్రీ శిశు సంక్షేమ శాఖ, డిఆర్‌డిఎ, డిఈఓ, సివిల్ సప్లై, జిల్లా పంచాయతీ తదితర శాఖల అధికారులు కూడా కార్యక్రమంలో పాల్గొననున్నారని కలెక్టర్ ప్రకటనలో పేర్కొన్నారు.
పిల్లల సమస్యలకు సంబంధించి వారి బంధువులు, తల్లిదండ్రులు, పోషకులు ఓపెన్ బెంచ్ బాల అదాలత్ కార్యక్రమంలో పాల్గొని తమ సమస్యలను తెలపాలని అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ ప్రకటనలో కోరారు.