కామారెడ్డి, ఆగష్టు 7
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : కామారెడ్డి జిల్లా కేంద్రంలోని ప్రైవేటు వైద్యశాలలో రక్తహీనతతో బాధ పడుతున్న లక్ష్మీ (38)మహిళకు అత్యవసరంగా ఏబి పాజిటివ్ రక్తం అవసరం కావడంతో వారి బంధువులు కామారెడ్డి రక్తదాతల సమూహ నిర్వాహకులు బాలును సంప్రదించారు.
కాగా జిల్లా కేంద్రానికి చెందిన ఆర్కే డిగ్రీ అండ్ పీజీ కళాశాలలో విధులు నిర్వహిస్తున్న కామర్స్ అధ్యాపకులు రమేశ్ రక్తదానం చేసి ప్రాణాలు కాపాడారు. ఈ సందర్భంగా బాలు మాట్లాడుతూ నేటి సమాజంలో మానవ సంబంధాలు అన్ని మనీ సంబంధాలుగా మారిన నేపథ్యంలో గత 13 సంవత్సరాల నుండి వేలాది మంది రక్తదాతలు 8 వేల 500 పైగా యూనిట్ల రక్తదానం చేయడం అంటే అది కామారెడ్డి జిల్లాకి గర్వకారణమని అన్నారు.
కరోనా సమయంలో కూడా తోటి వారి ప్రాణాలను కాపాడాలని మంచి సంకల్పంతో 100 యూనిట్ల ప్లాస్మాను 850 యూనిట్ల రక్తాన్ని అందజేయడం అంటే మానవత్వానికి ప్రతిరూపాలు రక్తదాతలే అని కొనియాడారు. మంచి మనసున్న ప్రతి ఒక్కరు రక్తదానం చేయడానికి ముందుకు రావాలని, రక్తదానం కంటే మించిన దానం మరొకటి భూమి మీద లేదన్నారు.
మనిషిగా బ్రతుకుతూ పదిమందికి మంచి చేయాలనే సంకల్పంతో 2007వ సంవత్సరంలో కామారెడ్డి రక్తదాతల సమూహాన్ని ఏర్పాటు చేయడం జరిగిందని ప్రస్తుతం కామారెడ్డితో పాటు నిజామాబాద్, బాన్సువాడ, ఎల్లారెడ్డి, రామాయంపేట మెదక్, కరీంనగర్, హైదరాబాద్ సిరిసిల్ల, ముస్తాబాద్ తదితర ప్రాంతాలకు చెందిన వారికి కూడా అత్యవసర పరిస్థితిలో రక్తాన్ని సకాలంలో అందజేయడం జరిగిందన్నారు. కార్యక్రమంలో సమూహ సభ్యులు లక్ష్మణ్ యాదవ్, స్వామి, స్వామి గౌడ్, టెక్నీషియన్ చందన్ పాల్గొన్నారు.