నిజామాబాద్, ఆగష్టు 10
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : అంతర్జాతీయ బాలల ఒడంబడిక చేర్చబడిన బాలల హక్కుల బాలల న్యాయ చట్టం 2015 ప్రకారం రాష్ట్రంలో రాష్ట్ర బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ ఏర్పాటు చేయడం జరిగిందని తెలంగాణ రాష్ట్ర బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ చైర్ పర్సన్ జె. శ్రీనివాస రావు తెలిపారు. ఆయన ఆధ్వర్యంలో ఈ కమిషన్ ఇతర సభ్యులతో కలిసి మంగళవారం కలెక్టరేట్లో బాల అదాలత్ బెంచ్‌ను ఏర్పాటు చేసి బాలలు, వారి తల్లిదండ్రులు, పోషకుల నుండి బాలల సమస్యలకు సంబంధించి దరఖాస్తులు స్వీకరించారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్, కమిషన్ సభ్యులు, సంబంధిత జిల్లా అధికారులతో కలిసి జ్యోతి ప్రజ్వలనతో కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఈ కమిషన్ ద్వారా బాలలకు జీవించే హక్కు కల్పించడం, రక్షణ పొందే హక్కు ఏర్పాటు చేయడం అదేవిధంగా అభివృద్ధి చెందడానికి, భాగస్వామ్యం పొందడానికి ఈ కమిషన్ ద్వారా వారికి రక్షణ కల్పించడం జరుగుతుందని తెలిపారు.
ఈ ప్రయాణం కేవలం నాంది మాత్రమేనని బాలల హక్కుల పరిరక్షణలో రాష్ట్రంలోని ప్రతి ప్రాంతానికి వారి హక్కుల పట్ల పెద్ద ఎత్తున అవగాహన కల్పించడంతోపాటు తల్లిదండ్రులకు వారి బిడ్డల హక్కులపై పూర్తిగా తెలిసేవిధంగా సమస్యల పట్ల వారు అధికారులు కమిషన్ దృష్టికి తీసుకువచ్చే విధంగా తద్వారా 18 సంవత్సరాల లోపు బాలల సమస్యలను పరిష్కరించి వారి సత్వరన్యాయం కోసం కమిషన్ కృషి చేస్తుందని పేర్కొన్నారు.
ఫిర్యాదులు స్వీకరించడం తద్వారా సంబంధిత అధికారులకు వాటిని తగు చర్య కై ఆదేశించడం కాకుండా అన్ని శాఖల అధికారులతో కమిషన్ సమిష్టిగా పనిచేసి బాలల ఆరోగ్యం విద్య న్యాయం కోసం ఎల్లప్పుడు కృషి చేస్తుందని పేర్కొన్నారు. ప్రతి బిడ్డ సమస్య పరిష్కారానికి అందరం కలిసి కృషి చేద్దామని అన్నారు. బాలల హక్కులకు భంగం కలిగినప్పుడు వారి హక్కులపై ఏర్పాటైన చట్టాలు అమలు కాకపోవడం ప్రభుత్వ సూచనలను ఆజ్ఞలను ఉల్లంఘించినపుడు కమిషన్ కలుగచేసుకుంటుందని, ఫిర్యాదులు స్వీకరిస్తుందని నోటీసులు జారీ చేస్తుందని కమిషన్‌కు సివిల్ కోర్టు అధికారాలు ఇవ్వబడినవి బాలల హక్కుల ఉల్లంఘన జరిగినప్పుడు ఏ వ్యక్తినైనా కమిషన్ ముందు హాజరు పరచవచ్చని మరెన్నో అధికారాలు ఈ కమిషన్ కు ఇవ్వడం జరిగిందని ఆయన వివరించారు.
ఫిర్యాదుదారులు తమ సమస్యలను వ్రాతపూర్వకంగా విన్నవించుకోవచ్చని ఫిర్యాదులు వారి అన్ని వివరాలు అందించాలని తద్వారా సంబంధిత శాఖలకు కమిషన్ ద్వారా ఆర్డర్ ఇవ్వడం జరుగుతుందన్నారు. జిల్లా కలెక్టర్ నారాయణ రెడ్డి మాట్లాడుతూ బాలల హక్కుల కోసం ఏర్పడిన ఈ కమిషన్ కేవలం హైదరాబాద్‌లో ఉండి సమస్యలు వినడం కాకుండా మన దగ్గరికి వచ్చి ఫిర్యాదులు స్వీకరించడం విచారణ జరపడం ఎంతైనా మన అద ృష్టమని తెలిపారు.
నేటి బాలలే రేపటి పౌరులు అనే నానుడిని నిజం చేయడానికి వారి అభివృద్ధి కోసం వారి రక్షణ కోసం కమిషన్ ఏర్పాటు చేసి సమస్యల పరిష్కారానికి కృషి చేయడం ఆనందించవలసిన విషయం అన్నారు. పిల్లలకు జీవించే హక్కుతో పాటు విద్యా, వైద్య ముఖ్యమైన సదుపాయాల ఏర్పాటుకు చర్యలు తీసుకోవడం వాటిని పక్కాగా అమలు జరిగే విధంగా చూడడం తదితర పనులకు కమిషన్ పనిచేస్తుందని ఈ దిశగా మనమంతా కూడా అటు బాలలకు ఇటు కమిషన్ పూర్తిస్థాయిలో సహకారం అందించవలసిన అవసరం ఎంతైనా ఉందన్నారు.
కరోనా వల్ల గత ఒకటిన్నర సంవత్సరాల నుండి పిల్లలు విద్యకు ఇబ్బంది పడుతున్నారని ఇప్పుడిప్పుడే సాధారణ పరిస్థితులు ఏర్పడుతున్నాయని తద్వారా వారిని తిరిగి విద్య వైపు దృష్టి కేంద్రీకరించే విధంగా కృషి చేయవలసి ఉంటుందని అన్నారు. కుటుంబంలో ఒక వ్యక్తి చదువుకుంటే తద్వారా ప్రయోజకులు అయితే ఆ కుటుంబానికి ఎంతో మేలు జరుగుతుందని బాలలకు నాణ్యమైన విద్యను అందివ్వాల్సిన బాధ్యత మన అందరి పైన ఉందన్నారు. బాల అదాలత్ బెంచ్ జారీచేసే ఆదేశాలను జిల్లా యంత్రాంగం తప్పకుండా అమలు చేస్తుందని పేర్కొన్నారు.
అంతకుముందు విద్య, స్త్రీ శిశు సంక్షేమ, వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన స్టాల్స్‌ను వారు పరిశీలించారు. అనంతరం ప్రజల నుండి ఫిర్యాదులు స్వీకరించారు. కార్యక్రమంలో అదనపు డిసిపి ఉషా విశ్వనాథ్, అదనపు కలెక్టర్
చంద్రశేఖర్, కమిషన్ సభ్యులు బృందాధర్ రావు, అరుణ, రాగ జ్యోతి, దేవయ్య, శోభారాణి, జిల్లా సంక్షేమ అధికారిణి రaాన్సీ, ఇతర జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు.