కామారెడ్డి, ఆగష్టు 10
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : బ్యాంకు లింకేజీ రుణాల లక్ష్యాలు సాధించిన వారికి ఆగస్టు 15 రోజున సన్మానం చేస్తామని జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎ.శరత్ అన్నారు.
సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలోని సమావేశ మందిరంలో ఐకెపి అధికారులతో రుణాల పురోగతిపై సమీక్ష నిర్వహించారు. బ్యాంకు లింకేజీ రుణాలు ఆగస్టు 15 లోగా 55 శాతం లక్ష్యాలను పూర్తి చేసినవారికి సన్మానం చేయనున్నట్లు చెప్పారు. కామారెడ్డి ఎల్లారెడ్డి, బాన్సువాడ మున్సిపల్ పరిధిలో లక్ష్యానికి అనుగుణంగా రుణాలను మహిళలకు ఇప్పించాలని కోరారు.
స్త్రీ నిధి 50 శాతం రుణాలు మహిళలకు ఇప్పించాలని పేర్కొన్నారు. బిక్నూర్ ఐకేపీ అధికారులు ఇప్పటికే 49 శాతం రుణాలు మహిళా సంఘాలకు ఇప్పించినందుకు వారిని అభినందించారు. అన్ని మండలాల్లో స్వయం సహాయక సంఘాలు బకాయి రుణాలు లేకుండా చూడాలని కోరారు. స్త్రీ నిధి పథకం కింద అర్హత గల లబ్ధిదారులను ఎంపిక చేసి గేదె కొనుగోలు రుణాలు మంజూరు చేయాలని సూచించారు.
పేద మహిళలు ఆర్థిక స్వావలంబన సాధించే విధంగా చూడాలన్నారు. సూక్ష్మ రుణాలు ఇవ్వడానికి ప్రతి గ్రామ సంఘం నుంచి ముగ్గురు సభ్యులను గుర్తించి వారికి జనరల్ స్టోర్స్, కిరాణా దుకాణం, పిండి గిర్ని వంటివి ఏర్పాటు చేసుకోవడానికి రుణాలు ఇవ్వాలని పేర్కొన్నారు. ఈనెల 25 లోగా 85 శాతం స్త్రీ నిధి రుణాలు రికవరీ చేయాలని అధికారులను ఆదేశించారు. సమావేశంలో జిల్లా ఇన్‌చార్జి అదనపు కలెక్టర్ డి.వెంకట మాధవరావు, లీడ్ బ్యాంక్ మేనేజర్ రాజేందర్ రెడ్డి, ఐకేపీ అధికారులు పాల్గొన్నారు.