అనాధ ఆడపిల్లలకు రూ.1.62 లక్షల విరాళాలు

జగిత్యాల, ఆగష్టు 10

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : జగిత్యాల జిల్లా బుగ్గారం మండల కేంద్రానికి చెందిన భార్యాభర్తలైన యువజంట చుక్క జలజ – చుక్క రమేష్‌ లిద్దరూ నెల గడువులోనే గత జూన్‌ – జులై మాసాలలో చనిపోయారు. వీరి సంతానంగా ఇద్దరు ఆడపిల్లలు చుక్క సంధ్య (13) చుక్క నాగలక్ష్మి (10) లు తల్లిదండ్రులు లేని, ఉండడానికి గూడు కూడా సరిగా లేని అనాధలయ్యారు.

వీరి పరిస్థితి గురించి మీడియా, సోషల్‌ మీడియాల ద్వారా తెలుసుకున్న కొందరు దాతలు కులమతాల కతీతంగా, రాజకీయాల కతీతంగా సహృదయంతో స్పందించి విరాళాలు అందజేశారు. గల్ఫ్‌ సేవా సమితి బుగ్గారం పక్షాన రూ. 55 వేలు, సోషల్‌ మీడియాలో యువత ద్వారా రూ. 54 వేలు ఇతర ప్రముఖులు, రాజకీయ నేతల ద్వారా రూ. 53 వేలు, మొత్తం రూ.1 లక్ష 62 వేల విరాళాలు అందజేశారు.

ఇందులో నుండి పిల్లల భవిష్యత్‌ కొరకు తలా రూ.54 వేల చొప్పున రూ.1 లక్ష 08 వేలు బ్యాంక్‌లో పిక్స్‌డ్‌ డిపాజిట్‌ చేసి మిగతా సొమ్ము వారి అవసరాల కొరకై వేర్వేరుగా పిల్లల సేవింగ్‌ ఖాతాలలో రూ.27వేల చొప్పున జమచేశారు. ఈ అనాధ పిల్లల కోసం బుగ్గారం గ్రామస్తులైన సాన తిరుపతి, మహమ్మద్‌ అజ్మీర్‌ షరీఫ్‌, సాన మల్లేశం, బొడ్డు అనిల్‌, కొడిమ్యాల రాజేష్‌, భారతపు గంగాధర్‌, సుంకం ప్రశాంత్‌ తదితరులు లు విశేష కృషి సల్పారు.

ఇటీవల జరిగిన బుగ్గారం పర్యటన సందర్భంగా రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్‌ స్వయంగా అనాధ పిల్లలతో మాట్లాడి వారి విద్యాభివృద్ధికి, ఇతర అవసరాలకు తనవంతు సహాయము చేస్తామని హామీ ఇస్తూ తక్షణ సహాయంగా రూ.10వేలు నగదుగా అందజేశారు. దాతలకు, పిల్లల భవిష్యత్‌కై విరాళాల సేకరణకు కృషి చేసిన వారికి పలువురు ప్రముఖులు, బుగ్గారం గ్రామస్తులు, గ్రామ అభివృద్ధి కమిటీ, స్థానిక ప్రజాప్రతినిధులు, నాయకులు, మృతి చెందిన జంట బంధుమిత్రులు కృతజ్ఞతలు తెలిపారు.

Check Also

నేటి పంచాంగం

Print 🖨 PDF 📄 eBook 📱 శనివారం, నవంబరు 23, 2024శ్రీ క్రోధి నామ సంవత్సరందక్షిణాయణం – శరదృతువుకార్తీక …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »