నిజామాబాద్, ఆగష్టు 10
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : అంతర్జతీయ ఫుట్‌బాల్ క్రీడాకారిణి, భారత దేశం ఫుట్‌బాల్ జట్టు సభ్యురాలు గుగులోత్ సౌమ్యకు సొంత వ్యాయామశాల ఏర్పాటు చేసుకోవాల్సిన అవసరం ఉందని, ఇందుకోసం దాదాపు 7 లక్షల రూపాయలు అవసరమని కేర్ ఫుట్‌బాల్ అకాడమీ అధ్యక్షులు నరాల సుధాకర్, కోచ్ నాగరాజు ద్వారా తెలుసుకున్న హైదరబాద్‌కు చెందిన ప్రముఖ వ్యాపారవేత్త కొత్తపల్లి కిషోర్ తనవంతు సహాయంగా లక్ష రూపాయలు అందజేశారు.
గుగులోత్ సౌమ్యకు హైదరాబాద్‌లోని తన నివాసంలో అందించారు. ఆడపిల్లలు అన్ని రంగాల్లో రాణించడం సంతోషకరమని, మారుమూల గిరిజన ప్రాంతానికి చెందిన అమ్మాయి భారత దేశ ఫుట్‌బాల్ జట్టుకు ప్రాతినిధ్యం వహించడం గొప్ప విషయమని కిషోర్ అన్నారు. భవిష్యత్తులో కూడా సౌమ్యకు అండ దండగా ఉంటామన్నారు.
సౌమ్య ఇంకా ఎన్నో విజయాలు సాధించి మన దేశానికి పేరు ప్రతిష్టలు తేవాలని ఆకాంక్షించారు. సౌమ్యకు శిక్షణ ఇచ్చిన నాగరాజును అభినందించారు. సౌమ్యకు ఎల్లవేళల అండగా నిలబడ్డ తల్లి తండ్రులు గోపి లక్ష్మిలను కూడా అభినందించారు. కార్యక్రమంలో కొత్తపల్లి కిషోర్‌తో పాటు, కొత్తపల్లి మీన కిషోర్, సౌమ్య తల్లి తండ్రులు గోపి లక్షి, సాకేత్ ఉన్నారు.