నిజామాబాద్, ఆగష్టు 12
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : జిల్లాలో 4 వేల మేలైన పాడి పశువులను మహిళా సంఘాల సభ్యులకు స్త్రీ నిధి ద్వారా రుణాలు అందించేందుకు వారం రోజుల్లో లబ్ధిదారులను ఎంపిక చేయడానికి విజయ డైరీ, డైరీ డెవలప్మెంట్, డిఆర్‌డిఎ, వెటర్నరీ అధికారులు చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ నారాయణ రెడ్డి ఆదేశించారు. గురువారం సెల్ కాన్ఫరెన్సు ద్వారా సంబంధిత అధికారులతో పాడి పశువుల పంపిణీకి చర్యలు తీసుకోవడం విషయమై మాట్లాడారు.
మేలైన పాడి పశువుల నిర్వహణ ద్వారా ఆర్థికంగా అభివృద్ధి చెందుటకు ఎంతో అవకాశం ఉన్నదని వ్యవసాయానికి అనుబంధంగా పాడి పరిశ్రమ ద్వారా ప్రజలు ఆర్థికంగా ఎదగడానికి ఎంతో వీలున్నదని అన్నారు. మహిళా సంఘాలలోని అర్హులైన మహిళలకు ముఖ్యంగా ఎస్సీ, ఎస్టీ పేద మహిళలకు అవకాశం కల్పించాలని తెలిపారు. ఒక్కో పాడి పశువు కు రూ. 93 వేల 270 స్త్రీ నిధి ద్వారా రుణాన్ని అందించి వాటిని ఇతర రాష్ట్రాల నుండి స్వయంగా లబ్ధిదారులు మేలైన పాడి ఆవులను లేదా గేదెలను ఎంపిక చేసుకోవడానికి వెసులుబాటు కల్పించడం జరుగుతుందని అన్నారు.
వాటిని ఖరీదు చేసినప్పటి నుండి యునైటెడ్ ఇన్సూరెన్స్ కంపెనీ ద్వారా రవాణా బీమా కూడా కల్పించడం జరుగుతుందని, ప్రతి పాడి గేదె ద్వారా నెలకు కనీసం 15 వేల రూపాయలు లాభాలు ఆర్జించడానికి అవకాశం ఉన్నట్లు తెలిపారు. పాలను విజయ డైరీ వారు సేకరించనున్నారని అందువల్ల లబ్ధిదారులు పాల అమ్మకంపై ఆలోచించవలసిన అవసరం లేదన్నారు. అంతేకాక లబ్ధిదారులకు పాడి పశువులకు కూడా కూడా బీమా సదుపాయం ఉన్నదని పేర్కొన్నారు.
ఇప్పటికే నాలుగువేల లక్ష్యంలో 1500 లబ్ధిదారులను గుర్తించడం జరిగిందని మరో రెండు వేల ఐదు వందలు మంది లబ్ధిదారులను ఎంపిక చేయడానికి అర్హులైన వారి నుండి దరఖాస్తులు స్వీకరించాలని ఈ ప్రక్రియ వారం రోజుల్లో పూర్తి చేయాలని ఆదేశించారు. వారం రోజులు సంబంధిత అధికారులు అందరూ అర్హులను గుర్తించి పూర్తిస్థాయిలో లక్ష్యాన్ని పూర్తి చేయటానికి చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.
మహిళా సంఘాలకు ఈ సంవత్సరం బ్యాంకు లింకేజీ రుణాలు కేవలం 23 శాతం మాత్రమే పూర్తయిందని ఇతర జిల్లాల్లో మనకంటే బాగా ఉందని అధికారులు ఈ దిశగా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. సెల్ కాన్ఫరెన్సులో డిఆర్‌డిఓ చందర్ నాయక్, స్త్రీ నిధి జోనల్ ఆఫీసర్ అనంత్ కిషోర్, ఎల్‌డిఎం సురేంద్రబాబు, జిల్లా పశు వైద్య శాఖ అధికారి భరత్, విజయ డైరీ, డైరీ డెవలప్మెంట్ అధికారులు, తదితరులు పాల్గొన్నారు.