నిజామాబాద్, ఆగష్టు 14
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ఆదివారం నిర్వహించుకునే 75వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు దేశభక్తి స్ఫూర్తితో అత్యంత పకడ్బందీగా, ఆకర్షనీయంగా ఉండేవిధంగా ఏర్పాట్లు జరగాలని జిల్లా కలెక్టర్ నారాయణ రెడ్డి ఆదేశించారు.
స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు జరిగే స్థానిక పోలీస్ పరేడ్ గ్రౌండ్‌లో శనివారం ఆయన సంబంధిత అధికారులతో కలిసి ఏర్పాట్లను పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ కార్యక్రమానికి హాజరయ్యే ప్రతి ఒక్కరు కూడా కోవిడ్ నిబంధనలు పాటించే విధంగా అధికారులు తగు చర్యలు తీసుకోవాలని తెలిపారు.
రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలు కార్యక్రమాలకు సంబంధించి ఏర్పాటు చేస్తున్న శకటాలు మంచి సమాచారాన్ని అందించే విధంగా రూపొందించాలని, అదేవిధంగా పలు శాఖల ఆధ్వర్యంలో ఏర్పాటు చేస్తున్న స్టాల్స్ సంబంధిత శాఖలకు చెందిన సిబ్బంది అందుబాటులో ఉండే విధంగా చూడాలని తద్వారా ఆ శాఖకు సంబంధించిన సమాచారాన్ని ప్రజలకు వారు తెలియజేయవలసి ఉంటుందని అన్నారు.
సౌండ్ సిస్టం బాగా పని చేసే విధంగా చెక్ చేసుకోవాలని, సాంస్కృతిక కార్యక్రమాలు ఆకర్షించే విధంగా ఉండాలని కలెక్టర్ పేర్కొన్నారు. ఉత్సవాలకు హాజరయ్యే ముఖ్యమైన అతిథులకు అవసరమైన కనీస ఏర్పాట్లు చూడాలని ఆదేశించారు. కలెక్టర్ వెంట అదనపు కలెక్టర్ చంద్రశేఖర్, మున్సిపల్ కమిషనర్ జితేష్ వి పాటిల్, జిల్లా పరిషత్ సీఈవో గోవింద్, డిఆర్‌డిఓ చందర్ నాయక్, జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు.