కామారెడ్డి, ఆగష్టు 14
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : తెలంగాణ రాష్ట్రంలో గడిచిన ఆరు నెలల్లో 18 మంది నిరుద్యోగులు ఉద్యోగ నోటిఫికేషన్లు రావడము లేదు అన్న బాధతో ఆత్మహత్యలు చేసుకోవడం టిఆర్‌ఎస్ అసమర్థ పాలనకు అద్దం పడుతుందని టీఎన్‌ఎస్‌ఎఫ్ రాష్ట్ర కార్యదర్శి బాలు విమర్శించారు. ఉద్యోగాలు లేక ఒకవైపు ఆత్మహత్యలు చేసుకుంటే ప్రభుత్వం ఉద్యోగుల వయోపరిమితిని 61 సంవత్సరాలకు పెంచడం కెసిఆర్ తుగ్లక్ పాలనకు నిదర్శనంగా కనబడుతుందనీ ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో బాలు పేర్కొన్నారు.
తెలంగాణ రాష్ట్రం వస్తే నిరుద్యోగులకు ఉద్యోగాలు వస్తాయని భావిస్తే కెసిఆర్ కుటుంబంలోని వారికి ఉద్యోగాలు వచ్చాయే తప్పా నిరుద్యోగులకు ఉద్యోగాలు రాలేదన్నారు. రాష్ట్రంలో ఒక లక్షా 90 వేల ఉద్యోగాలు ఖాళీగా ఉంటే వాటిని భర్తీ చేయాల్సిన ప్రభుత్వం కాలయాపన చేస్తూ నిరుద్యోగులను మానసికంగా ఇబ్బందులకు గురి చేస్తూ ఆత్మహత్య చేసుకునేలా చేస్తుందని, నిరుద్యోగుల ఆత్మహత్యలు టిఆర్‌ఎస్ ప్రభుత్వ హత్యలుగా భావించాల్సిదేననీ, హుజురాబాద్ ఎన్నికల్లో ఏ ముఖం పెట్టుకుని నిరుద్యోగుల ఓట్లు అడుగుతారని ఇప్పటికైనా చిత్తశుద్ధి ఉంటే రాష్ట్రంలో ఉన్న ఖాళీలపై శ్వేతపత్రం విడుదల చేసి వెంటనే భర్తీ ప్రక్రియను చేపట్టాలని డిమాండ్ చేశారు.
ఎన్నికలు వచ్చినప్పుడే ఉద్యోగ ప్రకటనలు అని ఎన్నికలు అయిన తరువాత వాటి నియామకాల ప్రక్రియల గురించి టిఆర్‌ఎస్ నాయకులు మరిచిపోయారని హుజురాబాద్ ఎన్నికల్లో నిరుద్యోగులు, విద్యార్థులు ముఖ్యమంత్రి కేసీఆర్‌కు కనువిప్పు కలిగిస్తారు. తెలంగాణ రాష్ట్రం నుండి కెసిఆర్‌ను తరిమి కొడితే ఉద్యోగ అవకాశాలు సాధ్యమని మరొకమారు విద్యార్థులు నిరుద్యోగులు ఉద్యమ బాట పట్టాలని పిలుపునిచ్చారు.
ఈటెల రాజేందర్ విజయంతో టిఆర్‌ఎస్ అసమర్థ పాలన గురించి తెలంగాణ ప్రజలకు, బంగారు తెలంగాణ అని గొప్పలు చెబుతున్న కేసీఆర్ అర్థమవుతుందని అన్నారు. కార్యక్రమంలో నాయకులు అంజల్ రెడ్డి, సతీష్, సందీప్ రాజు, వసంత్, నవీన్ పాల్గొన్నారు.