నిజామాబాద్, ఆగష్టు 15
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : స్వాతంత్ర దినోత్సవ కార్యక్రమాల్లో భాగంగా కలెక్టర్ క్యాంప్ కార్యాలయంలో నిర్వహించిన ఎట్ హోమ్‌లో సాంస్కృతిక కార్యక్రమాలు ఆహూతులను అలరించాయి. అందులో చందన శ్రీనివాస్ మ్యాజిక్ ఆకట్టుకుంది. మెజీషియన్ రంగనాథ్ కార్యక్రమాలు అందరిని ఆశ్చర్య చకితులను చేశాయి. బొమ్మతో మిమిక్రి పిల్లలను, పెద్దలను ఒప్పించింది. కళాకారులు అష్ట గంగాధర్ పాటలతో అదేవిధంగా చిన్నారి డాన్స్‌ను అధికారులు అభినందించారు.
ఈ సందర్భంగా కలెక్టర్ నారాయణ రెడ్డి మాట్లాడుతూ ప్రతిరోజు కార్యాలయ వత్తిడిలో ఉండే అధికారులకు ఎట్ హోమ్ కార్యక్రమం కొంత ఆహ్లాదాన్ని పంచుతుంది అనడంలో ఎటువంటి సందేహం లేదన్నారు. జిల్లాలో గ్రామస్థాయి నుంచి జిల్లా స్థాయి వరకు అధికారుల టీం బాగా పనిచేస్తుందని ప్రభుత్వ లక్ష్యాలకు అనుగుణంగా అందరూ విధులు నిర్వహిస్తున్నారని రానున్న రోజుల్లో అందరం కలిసి మరింత మంచి ఫలితాలు తీసుకురావడానికి కృషి చేద్దామని పిలుపునిచ్చారు.
ప్రభుత్వ ఉద్యోగులుగా అధికారులుగా అవకాశం రావడం దేవుడు కల్పించిన ఒక మంచి అవకాశం అని వీలైనంత వరకు ప్రజలకు ఎక్కువ సేవలందించడానికి మనమంతా ఎల్లప్పుడు సిద్ధంగా ఉండాలని పేర్కొన్నారు. కుటుంబ సభ్యులను అశ్రద్ధ చేయవద్దని తాను ఎప్పుడూ చెప్పలేదని, వారి బాగోగులు చూసుకుంటూనే ప్రభుత్వ కార్యక్రమాలపై కూడా దృష్టి పెట్టవలసిన అవసరం ఉండదని రోజు ఏడు ఎనిమిది గంటల పని చేస్తే అనుకున్న లక్ష్యాలు పూర్తి చేయడానికి సరిపోతుందని ఈ దిశగా అధికారులు ముందుకు వెళ్లాలని కోరారు.
గత నాలుగు మాసాలుగా రెవెన్యూ అధికారులు ప్రత్యేక కార్యక్రమాల వల్ల చాలా కష్టపడుతున్నారని మరికొద్ది రోజుల్లో కార్యక్రమాలన్ని పూర్తి కానున్నాయని ఆయన అన్నారు. కోవిడ్ కారణంగా గత సంవత్సరం పైగా అభివృద్ధి కార్యక్రమాలపై సరిగా ఫోకస్ చేయలేకపోయామని ముందు రోజుల్లో కార్యక్రమాలు పూర్తి చేయడానికి అందరము కలిసి కృషి చేద్దామన్నారు. స్వాతంత్ర దినోత్సవ కార్యక్రమాలు జిల్లాలో పూర్తిస్థాయిలో విజయవంతం చేయడంలో తమ వంతు విధులు నిర్వహించిన జిల్లా అధికారులకు కలెక్టరేట్ సిబ్బందికి క్యాంపు కార్యాలయ సిబ్బందికి ఆయన క ృతజ్ఞతలు తెలిపారు.
సాంస్కృతిక కార్యక్రమాల్లో పాల్గొన్న వారికి జ్ఞాపికలు అందించి అభినందించారు. కార్యక్రమంలో జిల్లా ఫారెస్ట్ అధికారి సునీల్, అడిషనల్ కలెక్టర్లు చంద్రశేఖర్, చిత్ర మిశ్రా, ట్రైని ఐఏఎస్ ముకుంద్, మున్సిపల్ కమీషనర్ జితేష్, ఆర్డీవోలు నిజామాబాద్ రవి, ఆర్మూర్ వాసులు బోధన్ రాజేశ్వర్, జిల్లా పరిషత్ సీఈఓ గోవింద్ నాయక్, జెడి అగ్రికల్చర్ గోవింద్ నాయక్, జిల్లా అధికారులు, కుటుంబ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.