కామారెడ్డి, ఆగష్టు 15
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ప్రజా సేవకులుగా గురుతర బాధ్యతలు నెరవేర్చాలని, సంక్షేమ పథకాల ఫలాలు ప్రజలకు అందించాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎ.శరత్ అన్నారు. ఆదివారం స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలో జిల్లా కలెక్టర్ జాతీయ పతాకావిష్కరణ గావించారు. అనంతరం ఆయన ఉద్యోగులకు స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. ప్రజా సేవకులుగా మన బాధ్యతలను మరిచిపోవద్దని, ప్రభుత్వ పథకాలను ప్రజలకు అందించినప్పుడే అది నెరవేర్చినట్లని అన్నారు.
స్వాతంత్య్ర పోరాటంలో మహాత్మా గాంధీ చూపిన అహింసా మార్గంలో ప్రతి ఒక్క జీవి కూడా నడిచిందని, పటేల్, చిత్తరంజన్ దాస్, నెహ్రూ తదితర నాయకులు, అమరవీరుల త్యాగాల ఫలితంగా వచ్చిన స్వాతంత్రంలో ప్రజాసేవకుడుగా ప్రజల కోసం మనం ఉన్నామనే భావనతో, మన బాధ్యతలను గురుతర బాధ్యతలుగా నెరవేర్చాలని, ప్రభుత్వ పథకాలు ప్రజల్లోకి వెళ్లాలి అంటే మనం బాగా పని చేయాలని, ప్రభుత్వ కార్యక్రమాలను విజయవంతం చేయాలని అన్నారు.
నూతన కలెక్టరేట్‌లో తొలిసారిగా జెండా ఎగుర వేశామని, నూతన కలెక్టరేట్‌ను ముఖ్యమంత్రి ప్రారంభించినందుకు సంతోషంగా ఉందని, అందుకు వారికి కృతజ్ఞతలు తెలుపుతున్నానని అన్నారు. 64 కోట్ల 20 లక్షలతో ఏర్పాటైన నూతన కలెక్టరేట్ సముదాయము అద్భుత నిర్మాణంతో ఒక పర్యాటక స్థలంగా ఏర్పడిరదని, ఇలాంటి మంచి వాతావరణంలో ఉద్యోగులు అంకితభావంతో పని చేస్తూ ప్రభుత్వ ఆశయాలను ప్రజల్లోకి తీసుకు వెళ్లాలని కోరారు.
అంతకుముందు జిల్లా కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో జిల్లా కలెక్టర్ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. కార్యక్రమాలలో జిల్లా స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ వెంకటేష్ ధోత్రే, జిల్లా ఇన్చార్జి అదనపు కలెక్టర్ డి.వెంకట మాధవరావు, కలెక్టరేట్ ఏ.ఓ. రవీందర్, వివిధ శాఖల జిల్లా అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.