వేల్పూర్, ఆగష్టు 16
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ప్రతి గర్బిణీ అమ్మ ఒడి కార్యక్రమంలో పరీక్షలు చేయించుకోవాలని, ప్రభుత్వ ఆసుపత్రిలోనే కాన్పు చేయించుకోవాలని, పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని డాక్టర్ అశోక్ పేర్కొన్నారు.
వేల్పూర్ మండల కేంద్రంలోని ప్రభుత్వ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో సోమవారం అమ్మఒడి కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా డాక్టర్ అశోక్ మాట్లాడుతూ ప్రతి సోమవారం గర్భిణీలను పరీక్షించి వారికి సలహాలు సూచనలు ఇవ్వడం జరుగుతుందని, ప్రతి గర్భిణీ ప్రభుత్వ ఆసుపత్రిలో కాన్పు చేయించుకోవాలని తెలిపారు.
వర్షాకాలం దృష్టిలో ఉంచుకుని సీజనల్ వ్యాధులు ప్రబలే అవకాశం ఉంది కాబట్టి చికెన్‌గున్యా, మలేరియా, టైఫాయిడ్, డెంగ్యూ బారిన పడకుండా పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని, వ్యక్తిగత శుభ్రత పాటించాలని, ఇంటి పక్కన మురికి నీరు చేరకుండా చూసుకోవాలని తెలిపారు. మొదటి డోస్ వ్యాక్సినేషన్ కొనసాగుతుందని ప్రజలు ఎటువంటి ప్రలోభాలకు గురికాకుండా ఇంజక్షన్ తీసుకోవాలని, మూడవ దశ కరోన దృష్టిలో ఉంచుకొని ప్రజలు కచ్చితంగా మాస్కులను ధరించాలని, తరుచుగా చేతులను శుభ్రంగా కడుక్కోవాలన్నారు.
కార్యక్రమంలో సూపర్‌వైజర్ నాగమణి, వనమాల, ఫార్మసిస్ట్ ధర్మపురి, ల్యాబ్ టెక్నీషియన్ వేణు, హాస్పిటల్ సిబ్బంది, ఆరోగ్య కార్యకర్తలు, ఆశాలు తదితరులు పాల్గొన్నారు.