ఆర్మూర్, ఆగష్టు 17
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ఆర్మూర్ పట్టణంలోని వెంకటేశ్వర ఆలయంలో బుధవారం నుండి జెండా జాతర వేడుకలు అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్నారు. జాతరకు ఆర్మూర్ పరిసరాల ప్రాంతాల్లోని భక్తులు పెద్ద సంఖ్యలో తరలి వస్తారు. ఆర్మూర్ మండలం అంకాపూర్ కేంద్రంగా పాలన సాగించిన దొరలు జెండా పండుగ ప్రారంభించినట్లు ప్రతీతి. అనాదిగా వస్తున్న సంప్రదాయాన్ని ప్రస్తుతం ఆర్మూర్ సర్వ సమాజ సభ్యులు కొనసాగిస్తున్నారు.
జెండా జాతర కోసం తొమ్మిది రోజుల ముందు ఆర్మూర్ పట్టణం పట్టణంలో నేసిన 20 మీటర్ల పట్టు వస్త్రాన్ని జెండాపై ఉంచి దానిపై ఓ గుర్తును పెడతారు. శ్రావణ శుద్ధ తదియ రోజున జెండాను ప్రతిష్టించిన అనంతరం తొమ్మిది రోజుల పాటు జెండాకు ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు.
ప్రతిరోజు పూజలు నిర్వహించి తీర్థ ప్రసాదాలు ఇస్తారు. తొమ్మిది రోజుల పాటు పూజలు నిర్వహించారు. మంగళవారం సర్వ సమాజ్ ఆలయ అభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో అత్యంత వైభవంగా జెండా జాతర నిర్వహిస్తారు. ఉదయాన్నే భక్తుల ప్రత్యేక పూజలతో ప్రారంభమయ్యే జాతర సాయంత్రం 5 గంటల వరకు కొనసాగుతుంది. తర్వాత జెండాను ఊరేగింపుగా జెండా మందిరం నుండి అంకాపూర్ చివరి వరకు తీసుకువెళ్లి అంకాపూర్ గ్రామస్తులకు అప్పగిస్తారు అక్కడి నుండి అంకాపూర్ గ్రామస్తులు ఊరేగింపుగా తీసుకు వెళ్లి గ్రామంలో ప్రతిష్టిస్తారు.
జెండాను ఇదేవిధంగా గ్రామ గ్రామానికి ఊరేగిస్తూ చివరకు తిరుమల తిరుపతిలోని శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయానికి జెండాను చేరుస్తారు. జండా జాతరలో భక్తిశ్రద్ధలతో పూజలు నిర్వహిస్తే తమ మొక్కలు తీరుతాయని భక్తుల నమ్మకం. పట్టణానికి చెందిన భక్తులతో పాటు చుట్టుపక్కల గ్రామాలకు చెందిన భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చి దర్శనం చేసుకొంటారు.
ఇప్పటికే జాతరను ఘనంగా నిర్వహించడానికి ఆలయ కమిటీతో పాటు సర్వ సమాజ్ కమిటీ సభ్యులు ఏర్పాట్లను పూర్తి చేశారు. ఈనెల 11న శ్రావణ శుద్ధ తదియ రోజున ప్రత్యేక పూజలు చేసి అనంతరం జెండాను ప్రతిష్టించారు. మంగళవారం జెండా జాతర నిర్వహిస్తున్నట్లు సర్వ సమాజ సభ్యులు తెలిపారు. సర్వసమాజ్ అధ్యక్షులు మహేష్, కార్యదర్శి మధుసూదన్, కిషన్ పోహార్, శైలేష్, సర్వ సమాజ్ సభ్యులు కమిటీ సభ్యులు తెలిపారు.