నిజామాబాద్, ఆగష్టు 17
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : నగరపాలక సంస్థలో నూతనంగా నియమింపబడ్డ పారిశుద్ధ్య కార్మికుల మూడు నెలల బకాయి వేతనాలు వెంటనే చెల్లించాలని ఏఐటీయూసీ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. గత ఐదు నెలల క్రితం నూతనంగా ఏజెన్సీ ద్వారా 330 మంది పారిశుద్ధ్య విభాగానికి సంబంధించిన కార్మికులు, డ్రైవర్ల సమస్యలు పరిష్కరించాలని ఏఐటియుసి ఆధ్వర్యంలో నగర పాలక సంస్థ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించిన అనంతరం మేయర్ దండు నీతు కిరణ్, ఎంహెచ్‌వోకు వినతి పత్రాన్ని సమర్పించి సమస్యలపై చర్చించారు.
ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్ర మున్సిపల్ స్టాఫ్ కాంట్రాక్ట్ వర్కర్స్ యూనియన్ ఏఐటియుసి జిల్లా అధ్యక్షులు వై ఓమయ్య మాట్లాడుతూ నగరపాలక సంస్థలో గతంలో పని చేస్తున్న పర్మినెంటు, అవుట్సోర్సింగ్ కార్మికులకు పని భారం పెరిగిందని నూతనంగా కార్మికుని తీసుకోవాలని యూనియన్‌గా సంవత్సరాల కాలంగా చేసిన పోరాటాల ఫలితంగా పాలకవర్గం 330 మంది కార్మికులను ప్రైవేట్ ఏజెన్సీ ద్వారా పనిలోకి తీసుకున్న అధికారులు సరైన రీతిలో కార్మికులను పనిలో పెట్టడంలో విఫలం కావడంతో మరింత పనిభారం కార్మికులపై పడుతుందన్నారు.
ఏజెన్సీ ద్వారా రిక్రూట్ అయిన కార్మికులు దాదాపు 10 గంటలు పని చేయాల్సిన పరిస్థితి వస్తుందన్నారు. ఐదు నెలలు అవుతున్నా వారికి నేటికీ పీఎఫ్, ఈఎస్‌ఐ, ఇన్సూరెన్స్ సౌకర్యాలు కనిపించలేదని, పనిముట్లు ఇవ్వలేదని, గ్లౌజులు, మాస్కులు, రెయిన్ కోట్లు ఇవ్వకపోవడంతో కార్మికులు ఎలా పని చేస్తారని ప్రశ్నించారు. మూడు నెలల బకాయి వేతనాలు వెంటనే చెల్లించాలని, మహిళా కార్మికులకు అటెండెన్స్ ఒకచోట పని మరొకచోట చెప్పే విధానం ఉపసంహరించుకోవాలన్నారు.
రాష్ట్ర ప్రభుత్వం ఈ మధ్యకాలంలో పెంచిన పిఆర్‌సిలో భాగంగా కార్మికులకు కూడా కేటగిరీల వారీగా 30 శాతం వేతనాలు పెంచుతూ అమలు చేయాలన్నారు. వీటన్నింటిపై సానుకూలంగా స్పందించిన మేయర్ వేతనాలు పనిముట్ల సమస్యను పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. మిగతా సమస్యలపై కమిషనర్, మేయర్, యూనియన్ నాయకత్వం జాయింట్ సమావేశం ఏర్పాటు చేసి వాటిలో చర్చించి పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు.
కార్యక్రమంలో యూనియన్ కార్యనిర్వాహక అధ్యక్షులు పి సుధాకర్, ప్రధాన కార్యదర్శి పీ నర్సింగరావు, నాయకులు సాయి, సందీప్, సాయిలు, చంద్రశేఖర్ కార్మికులు తదితరులు పాల్గొన్నారు.