వేల్పూర్, ఆగష్టు 18
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన రైతుబంధు పథకం కింద కొత్తగా పట్టాదార్ పాస్ బుక్కులు కలిగిన సభ్యులు కూడ రైతు బీమా పథకంలో చేర్చడం జరుగుతుందని మండల వ్యవసాయ అధికారి నరసయ్య తెలిపారు. వేల్పూర్ మండల కేంద్రంలో మీడియా సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా మాట్లాడుతూ రైతు బీమా పథకంలో భాగంగా గత సంవత్సరం పోలిస్తే ఈ సంవత్సరం 2021 సంవత్సరంలో వేల్పూర్ మండలంలో పట్టాదార్ పాస్ బుక్ కలిగిన రైతు బీమా సభ్యులు 10 వేల 170 మంది రైతులు ఉన్నారు. కాగా ఈ సంవత్సరం కొత్తగా పట్టాదారు పాసు బుక్కులు తీసుకున్న రైతులు 640 సభ్యులుగా గుర్తించడం జరిగిందన్నారు.
ఈనెల 18, 19 తేదీల్లో ప్రతి ఒక్క రైతు వయస్సు 60 కన్న తక్కువ ఉన్నవారు మళ్ళీ రైతు భీమా కోసం తమ పట్టాదారు పాస్ బుక్, ఆధార్ కార్డ్, నామిని ఆధార్ కార్డ్ జిరాక్స్ తీసుకొని గ్రామ పంచాయతీకి తీసుకురావాల్సిందిగా కోరారు. ప్రతి ఒక్క రైతు పట్టాదార్ పాస్ బుక్ మీద సర్వే నెంబర్ వారీగా తమ పంటలను రాసి సంతకం చేసి ఇవ్వాల్సిందిగా సూచించారు.
రైతు బీమా పథకం కింద రైతులకు తెలంగాణ ప్రభుత్వం ద్వారా 5 లక్షల రూపాయల బీమా సౌకర్యం కల్పించబడుతుందని, ఇంకా రైతులు ఇందులో ఏవైనా సందేహలు ఉంటే వ్యవసాయ సంబంధిత శాఖకు ఏఓల ద్వారా సంప్రదించవలసిందిగా కోరారు. కార్యక్రమంలో ఏఓ సంధ్య, సిబ్బంది, రైతులు తదితరులు పాల్గొన్నారు.