నిజామాబాద్, ఆగష్టు 18
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ఏ ఒక్కరూ కూడా ఆకలితో బాధపడకూడదని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఆహార భద్రత చట్టాన్ని అమలులోకి తీసుకు వచ్చాయని, గ్రామ స్థాయి నుండి జిల్లా స్థాయి వరకు అన్ని స్థాయిలలో ఆహార భద్రత చట్టంపై విజిలెన్స్ కమిటీలు ఏర్పాటు కావాలని ఈ కమిటీలు వారి బాధ్యతలను క్షుణ్ణంగా తెలుసుకొని ఉండి రెగ్యులర్‌గా సమావేశాలు నిర్వహించి చట్టం ప్రకారం లబ్ధిదారులకు అవి అందుతున్నాయో లేదో సమీక్షించాల్సిన అవసరం ఉన్నదని, కానీ దురదృష్టవశాత్తు ఆ విధంగా జరగడం లేదని రాష్ట్ర ఆహార భద్రత కమిషన్ చైర్మన్ కె తిరుమల్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు.
మళ్లీ మూడు నెలల లోపు కమిషన్ జిల్లాలో పర్యటిస్తుందని అప్పటివరకు విజిలెన్స్ కమిటీలు ఏర్పాటు చేయడమే కాకుండా ప్రతి ఒక్కరు వారి బాధ్యతలను గుర్తించి లబ్ధిదారులకు చట్టం ప్రకారం అన్ని అందుతున్నాయో లేదో సమీక్షించుకోవలసిన అవసరం ఉన్నదని క్షేత్రస్థాయిలో లోటుపాట్లు ఉంటే సరి చేయవలసిన బాధ్యత కూడా అధికారులు, ప్రజాప్రతినిధులపై ఉన్నదని నిర్లక్ష్యం వహిస్తే కమిషన్ ఏం చర్యలు తీసుకోవచ్చు చట్టంలో సూచించడం జరిగిందని ఆయన కఠినంగానే తెలిపారు.
క్షేత్రస్థాయిలో సమస్యలు ఏమిటి అని ప్రశ్నించారు. కరోనా సందర్భంగా పాఠశాలలు, అంగన్ వాడి కేంద్రాలు నడువనందున లబ్ధిదారులకు కలిగిన ఇబ్బందులపై ఆరా తీశారు. అంత్యోదయ కార్డుదారులకు ఎన్ని బియ్యం ఇవ్వాలో మీకు తెలుసా అని సర్పంచ్‌ను అడిగారు. అదేవిధంగా పాఠశాలలలో, అంగన్వాడీ కేంద్రాలలో, రేషన్ దుకాణాల ద్వారా ప్రజలకు బియ్యం సరఫరా, ఇతర పౌష్టిక ఆహార సరఫరా వల్ల ఇబ్బందులను, సమస్యలను కూడా అడిగి తెలుసుకున్నారు.
సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకురావాలంటే విజిలెన్స్ కమిటీలు పకడ్బందీగా విధులు నిర్వహించాలని అని లబ్ధిదారులకు కల్పించిన హక్కుల గురించి సమాచారం తెలియాలని, తీసుకోవాల్సిన చర్యల గురించి సమస్యల గురించి సమావేశాల ద్వారా తీర్మానాలు చేసి ఇటు కమిషన్ దృష్టికి అటు ప్రభుత్వం దృష్టికి తీసుకు వెళ్లాల్సిన అవసరం ఉన్నదని, అంతేకాక కమిషన్ కూడా ప్రభుత్వానికి సిఫారసు చేయడం ద్వారా సమస్యల పరిష్కారానికి కృషి చేస్తుందని పేర్కొన్నారు. విజిలెన్స్ కమిటీల నిర్మాణం జరగాలని సోషల్ ఆడిట్ ద్వారా అభ్యంతరాలను పరిశీలించాలని ప్రజల నుండి వచ్చిన ఫిర్యాదులకు పరిష్కరించాల్సిన బాధ్యత కూడా అధికారులు కమిషన్ పైన ఉన్నదని అన్నారు.
కొత్తగా ఏర్పడిన రాష్ట్రం చాలా పథకాలు అమలు చేస్తున్నారు వేరే రాష్ట్రాలతో పోలిస్తే వేగంగా ముందుకు వెళ్లడం ద్వారా అధికారులపై కొంత ఒత్తిడి కూడా ఉన్నదని సమిష్టిగా కలిసి ముందుకి వెళ్ళవలసిన అవసరం కూడా ఉండదని ఆయన అన్నారు. రేషన్ దుకాణాల ద్వారా రెండు కోట్ల 90 లక్షల మందికి 20 లక్షల పైగా విద్యార్థులకు మధ్యాహ్నం భోజనం ద్వారా అదేవిధంగా 20 లక్షల మంది లబ్ధిదారులకు అంగన్వాడీ కేంద్రాల ద్వారా పౌష్టికాహారం అందించే కార్యక్రమాలు జరుగుతున్నాయని, క్షేత్రస్థాయిలో ప్రజలతో మాట్లాడడం ద్వారా కొంత సంతృప్తికరమైన సమాధానాలు వచ్చాయని ఆందోళన చెందాల్సిన అవసరం లేదని తెలిపారు.
ప్రజలకు ఏం అందించాలో వారికి తెలియవలసిన అవసరం ఉండదని అప్పుడే వారు తమకు రావాల్సిన వాటి గురించి అడుగుతారని లేదంటే అక్రమాలు జరిగే అవకాశం ఉంటుందని పేర్కొన్నారు. అదేవిధంగా రేషన్ కార్డులో కొత్త సభ్యులను చేయడం చిన్న చిన్న మిస్టేక్స్ అర్హులకు కొత్తగా కార్డులు జారీ చేయడం తదితర విషయాలపై తాము ప్రభుత్వంతో ఇప్పటికే మాట్లాడడం జరిగిందని తద్వారా మూడు లక్షల పైచిలుకు కొత్త రేషన్ కార్డులు జారీ చేయడం జరిగిందని మిగతా సమస్యలను కూడా ప్రభుత్వం దృష్టికి తీసుకు వెళతామన్నారు.
కరోనా సందర్బంగా నగరంలో వీధి వ్యాపారులకు పది వేల రూపాయల చొప్పున సహాయం అందించడం అభినందించదగ్గ విషయమని ఈ సమయంలో ఈ సహాయం వారికి ఎంతో ధైర్యాన్ని ఇస్తుందని ప్రశంసించారు. మూడు నెలల్లో మళ్లీ ఈ కమిషన్ జిల్లా పర్యటనకు వచ్చే లోపుగా ఖాళీగా ఉన్న రేషన్ దుకాణాలకు డీలర్లను నియమించాలని వారి నియామకం సందర్బంగా జారీచేసే ధ్రువపత్రాలలో పాటించవలసిన అన్ని నిబంధనలను తెలియజేయాలని కోరారు. కొత్తగా గ్రామ పంచాయతీలు ఏర్పడిన ఆ సర్పంచుల విజ్ఞప్తి మేరకు అదేవిధంగా ప్రజలకు దూరం తగ్గించడానికి అనుకూలంగా ఉండే విధంగా కొత్తగా రేషన్ షాపులు ఏర్పాటు చేయుటకు ప్రభుత్వం చర్యలు తీసుకునే విధంగా కమిషన్ కృషి చేస్తుందన్నారు.
అంతకుముందు అడిషనల్ కలెక్టర్ చంద్రశేఖర్ జిల్లాలో పేద ప్రజలకు అందిస్తున్న బియ్యం నిత్యవసర వస్తువులు లబ్ధిదారులు రేషన్ కార్డుల గురించి వివరించారు. కరోనా సమయంలో ప్రభుత్వ ఆదేశాల ప్రకారం పేద ప్రజలకు ప్రైవేటు ఉపాధ్యాయులకు అదనపు బియ్యము, నగదు అందించడం జరిగిందని తెలిపారు. అంతేకాక అంగన్వాడి, ఆరోగ్య కార్యకర్తల ద్వారా ఇంటింటి సర్వే నిర్వహించి వారి ఆరోగ్య సమస్యలు, వ్యాధుల గురించి తెలుసుకొని అవసరమైన చికిత్సలు, మందులు అందించడమే కాకుండా కరోనా లక్షణాలు, పాజిటివ్ ఉన్నవారికి హోమ్ ఐసోలేషన్లో ఉంచి అవసరమైన వైద్య సేవలు అందించడం జరిగిందని వివరించారు.
జిల్లా విజిలెన్స్ కమిటీ కో -చైర్మన్ అయిన జిల్లా పరిషత్ చైర్మన్ విట్టల్ రావు మాట్లాడుతూ, జిల్లా స్థాయిలో అదేవిధంగా డివిజన్ స్థాయిలో ప్రజాప్రతినిధులకు, అధికారులకు ఈ చట్టంపై అవగాహన కార్యక్రమాలు ఏర్పాటు చేయవలసిన అవసరం ఉన్నదని, అదేవిధంగా రేషన్ దుకాణాల ద్వారా బియ్యంతో పాటు ఇతర నిత్యావసర వస్తువులను కూడా సరఫరా చేసేలా చూడాలని కోరారు.
సమీక్షా సమావేశంలో కమిషన్ సభ్యులు శారద, భారతి మున్సిపల్ కమిషనర్ జితేష్ పాటిల్, ట్రైనీ ఐఏఎస్ మకరంద్, ఆర్‌డివోలు శ్రీనివాస్, రవి, డిఆర్‌డిఓ చందర్ నాయక్, డీఎస్‌ఓ వెంకటేశ్వర్లు, డిఈఓ దుర్గాప్రసాద్, ఇతర జిల్లా అధికారులు, సర్పంచ్‌లు, మండల స్థాయి అధికారులు, ప్రజా ప్రతినిధులు, తదితరులు పాల్గొన్నారు.