కామారెడ్డి, ఆగష్టు 18
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : కోవిద్ వాక్సినేషన్ పెంచాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎ.శరత్ వైద్యాధికారులను ఆదేశించారు. బుధవారం ఆయన హెల్త్ ఇండికేటర్ పై వైద్య శాఖ అధికారులతో సమీక్షించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి మలేరియా, డెంగ్యూ, కోవిడ్ పాజిటివ్ కేసుల ఇండ్లను డిప్యూటి డిఎం అండ్ హెచ్‌వో ఎంపీవో, మెడికల్ ఆఫీసర్ ఖచ్చితంగా సందర్శించాలని, నియంత్రణ చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. జిల్లాలోని 29 ప్రైమరీ హెల్త్ సెంటర్లలో వ్యాక్సినేషన్ పెంచాలని, 50 శాతం పైగా వాక్సినేషన్ నిర్వహించిన హెల్త్ సెంటర్లో ప్రతిరోజూ 500 తక్కువ కాకుండా, 50 శాతం కన్నా తక్కువ వాక్సినేషన్ అయిన హెల్త్ సెంటర్లో 800 తగ్గకుండా వ్యాక్సిన్ వేయాలని, నివేదిక ప్రతిరోజూ సమర్పించాలని ఆదేశించారు.
పాజిటివ్ కేసు ఉన్న దగ్గర చుట్టూ ఐదు కిలోమీటర్ల పరిధిలో హౌస్ హోల్డ్ సర్వే పక్కాగా నిర్వహించాలని, కిట్స్ పంపిణీ చేయాలని ఆదేశించారు. చిన్న పిల్లలకు వ్యాధి నిరోధక టీకా ఇమ్యునైజేషన్ కార్యక్రమం ప్రతి బుధవారం, శనివారం నిర్వహించాలని, ఐసిడిఎస్ సిబ్బంది సమన్వయంతో క్షేత్రస్థాయిలో పనిచేయాలని, అర్హత కలిగిన ప్రతి చిన్నారికి ఇమ్యునైజేషన్ చేయాలని అన్నారు.
గర్భిణి స్త్రీల నమోదు పక్కాగా జరగాలని, కెసిఆర్ కిట్స్ అందించాలని అన్నారు. జిల్లాలో 15 వెల్ నెస్ సెంటర్లు వచ్చే వారంలోగా ప్రారంభించాలని ఆదేశించారు. సబ్ సెంటర్ల పరిధిలో అవసరమున్న చోట సిబ్బందిని నియమించుకోవాలని సూచించారు. మెడికల్ ఆఫీసర్, ల్యాబ్ టెక్నీషియన్, ఎఎన్‌ఎం సిబ్బంది నియామకం వారంలోగా పూర్తిచేయాలని తెలిపారు. డెంగ్యూ కేసు గుర్తించిన ఇంటి చుట్టూ 50 ఇళ్లకు పైగా యాంటీ లార్వా స్ప్రే చేయాలని ఆదేశించారు. మలేరియా, డెంగ్యూ తదితర సీజనల్ వ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉండాలని అధికారులను ఆదేశించారు. కార్యక్రమంలో జిల్లా వైద్య శాఖ అధికారి డాక్టర్ చంద్రశేఖర్, ఇతర వైద్య అధికారులు పాల్గొన్నారు.