నిజామాబాద్, ఆగష్టు 19
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ప్రతి పద్యం రసోదయంగా రచించడం నంబి శ్రీధర్ రావు ప్రత్యేకత అని ప్రసిద్ధ లాక్షణికుడు రాజశేఖరుడు చెప్పినట్టు ఇదే కవిరాజు లక్షణమని ప్రసిద్ధ కవి అవధాని డాక్టర్ అయాచితం నటేశ్వరశర్మ అన్నారు. ఆయన గురువారం నిజామాబాద్ నగరంలోని లలితా దేవి ఆలయంలో ప్రముఖ కవి నంబి శ్రీధరరావు రచించిన శ్రీమన్నింబాచల మాహాత్మ్యము, శ్రీధరీయం గ్రంథాల ఆవిష్కరణ సభలో ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు.
పాల్కురికి సోమనాథుడు భక్త కవి పోతన సరసన నిలబడగలిగిన మహాకవి నంబి శ్రీధర్ రావు అని కొనియాడారు. నిజామాబాద్ జిల్లా భీమ్‌గల్ ప్రాంతంలోని లింబాద్రి నరసింహ స్వామి చరిత్ర అద్భుతమైన కావ్యంగా రాసి తెలంగాణలో పద్య కవులకు, మహా కవులకు కొదువ లేదని నంబి శ్రీధర్ రావు నిరూపించారని నటేశ్వరశర్మ అన్నారు.
బ్రహ్మ వైవర్తక పురాణం అంతర్గతంగా ఉన్న ఈ కథను చాలా సరళంగా సాహితీ ప్రియులకు అందించారని వివరించారు. తన కవిత్వాన్ని గంగగా నిర్వచించుకున్న శ్రీధరరావు తన జీవితం కవిత్వం పవిత్రంగా స్థిరీకరించుకున్నాడని కొనియాడారు. తెలంగాణ గడ్డపై వెలిసిన మహాకావ్యంగా ఈ గ్రంథం నిలిచిపోతుందని విశ్లేషించారు. కార్యక్రమానికి అధ్యక్షత వహించిన ప్రఖ్యాత కవి డాక్టర్ తల్లావజల మహేశ్ బాబు మాట్లాడుతూ నంబి శ్రీధర్ రావు సాహిత్యము సంగీతము చిత్రలేఖనం శిల్పకళలో ఆరితేరిన వ్యక్తి అని ఆయన పరిపూర్ణుడని, ఆయన ఇందూరు గడ్డపై జన్మించడం మనందరికీ గర్వకారణమన్నారు.
క్షేత్రసాహిత్యంలో చిరస్థాయిగా నిలిచిపోయే ఈ కావ్యంలోని ప్రతి పద్యంలో కొత్తదనాన్ని ఆవిష్కరించడం నంబి శ్రీధర్ రావుకు వెన్నతో పెట్టిన విద్య అని వివరించారు. 60 ఏళ్ల క్రితం రాసిన ఈ గ్రంథం ఇప్పుడు వెలుగు చూడటం ఎంతో ఆనందంగా ఉందన్నారు. తెలంగాణ పద్య సాహిత్యంలో నంబి శ్రీధర్ రావు ఇందూరు ముద్రను ఘనంగా వేశారని కొనియాడారు.
కావ్యాన్ని సమీక్షించిన తెలంగాణ విశ్వవిద్యాలయం ఆచార్యులు డాక్టర్ గుమ్మన్నగారి బాల శ్రీనివాసమూర్తి మాట్లాడుతూ 20కి పైగా ఛందస్సులను ప్రయోగించిన నంబి శ్రీధర్ రావు గొప్ప ప్రతిభామూర్తి అని నరసింహుని చరిత్రను అవలీలగా రాసాడని వివరించారు. ప్రబంధ సుగంధాన్ని ఆధునిక కాలంలో అందించిన మహాకవి శ్రీధర్ రావు అని సోదాహరణంగా వివరించారు.
ప్రముఖ నరసింహ స్వామి ఉపాసకులు డాక్టర్ వొజ్జల శరత్ బాబు మాట్లాడుతూ నరసింహ స్వామి కథను ఇంత రమణీయంగా రాసిన తెలుగు కవులు చాలా అరుదని, ఈ కావ్యం నింబగిరి విశిష్టతను ఆచంద్రతారార్కం నిలబెడుతున్నారు. డాక్టర్ కాసర్ల నరేశ్ రావు, ఓం ప్రకాష్ శ్రీధరీయం పుస్తకాన్ని సమీక్షించారు.
ఘనపురం దేవేందర్ వ్యాఖ్యానంతో సాగిన సభలో నరాల సుధాకర్, నంబి నరసింహారావు, నంబి నరహరిరావు, మార గంగాధర్, వి.పి. చందన్ రావు, చింతల శ్రీనివాస్, ఘంట్యాల ప్రసాద్, దారం గంగాధర్, సాయిబాబు, శారద, భారతి, శ్రీకాంత్, ఎలగందుల లింబాద్రి, పబ్బ మురళి తదితరులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా నంబి శ్రీధర్ రావు సతీమణి లక్ష్మీబాయిని సాహితీవేత్తలు ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో నంబి హరిణి, నంబి శౌరీ చరణ్, నంబి ధరణి, చాక్పల్లి శ్రీవిష్ణు ఆలపించిన గీతాలు అలరించాయి.