వేల్పూర్, ఆగష్టు 20
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : వేల్పూర్ మండల కేంద్రంతో పాటు ఆయా గ్రామాలలోని ఆలయాలలో శుక్రవారం మహిళలు అత్యంత భక్తి శ్రద్దలతో వరలక్ష్మి వ్రతం నిర్వహించారు. వరాలు ఇచ్చే దేవతగా వరలక్ష్మి దేవిని కొలుస్తారని శ్రావణమాసంలో పౌర్ణమికి ముందు వచ్చే శుక్రవారాన్ని వరలక్ష్మీ వ్రతంగా జరుపుకోవడం సంప్రదాయంగా వస్తుందని, సకల ఐశ్వర్యాలు లక్ష్మీదేవి అనుగ్రహంతో కలుగుతాయని ఆలయ అర్చకులు పేర్కొన్నారు.
కుటుంబసభ్యుల క్షేమం కోసం మహిళలు వరలక్ష్మి వ్రతం చేస్తారని, మహిళలకు పసుపు కుంకుమ తాంబూలాలు అందించి ఆశీర్వాదాలు పొందుతారని తెలిపారు. వరలక్ష్మి పూజ కోసం మహిళలు గురువారం ఏర్పాట్లు చేసుకున్నారు. వరలక్ష్మీ వ్రతం నిర్వహణ సందర్భంగా మార్కెట్లు మహిళలతో సందడిగా మారాయి.
శ్రీ మహా లక్ష్మి దేవి క్షీరా సాగరం నుంచి ఆవిర్భవించిందని, చంద్రుడు మహాలక్ష్మి దేవితో పాటు క్షీర సాగరం నుంచి ఆవిర్భవించారని, చంద్రుడు మహాలక్ష్మి దేవికి సోదరుడు పౌర్ణమికి ముందు చంద్రుడు సంపూర్ణమైన కాంతితో పూర్ణచంద్రుడిగా ప్రకాశిస్తూ ఉంటాడనీ శ్రావణ మాసం శ్రావణ నక్షత్రం మహా విష్ణువు జన్మ నక్షత్రం రోజున మహాలక్ష్మి దేవిని లక్ష్మీ దేవిగా ఆదరిస్తే కోరిన కోరికలు నెరవేరతాయని భక్తుల విశ్వాసం.