కామారెడ్డి, ఆగష్టు 22
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ఆదివారం కామారెడ్డి జిల్లా దోమకొండ మండల కేంద్రంలోని బేతాళ్ అనాధాశ్రమంలో రాఖీ పౌర్ణమి పురస్కరించుకొని అఖిల భారతీయ ప్రజా సేవా సమాచార హక్కు చట్ట పరిరక్షణ కమిటీ ఆధ్వర్యంలో ఘనంగా రక్షాబంధన్ వేడుకలు నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా దోమకొండ ఎస్‌ఐ సుధాకర్ హాజరై అనాధ చిన్నపిల్లలకి రాఖీలు కట్టించారు. అనంతరం పిల్లలు తమ స్వహస్తాలతో కార్య నిర్వాహకులకు రాఖీలు కట్టి తమ సంతోషాన్ని వెలిబుచ్చారు. అనంతరం ఎస్‌ఐ చేతుల మీదుగా పిల్లలకు పండ్లు పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా ఎస్‌ఐ సుధాకర్ మాట్లాడుతూ రక్షాబంధన్ పండగ ఆత్మీయతలు, అనురాగాలు, అనుబంధాల సౌరభాల్ని వెదజల్లి అపురూపమైన పర్వదినం రాఖీ పండుగ అని అన్నారు. అక్క చెల్లెల, అన్నదమ్ముల అనుబంధానికి రక్ష అని అన్నారు. రాఖీ పండగను అనాధాశ్రమంలో పిల్లలతో జరుపుకోవడం అదృష్టంగా భావిస్తున్నానన్నారు. పిల్లలు బాగా చదువుకుని తమ భవిష్యత్తును బంగారు బాటగా దిద్దుకోవాలని కష్టంతో కాకుండా ఇష్టపడి చదివితే ఉన్నత శిఖరాలకు ఎదుగుతారని, అనాధ పిల్లలు కారు మన అందరి పిల్లలని భావించాలని అన్నారు.
ఎల్లవేళల తన సహాయ సహకారాలు బేతాళ్ అనాధ ఆశ్రమానికి ఉంటాయని ఆశ్రమం ఫౌండర్ చైర్మన్ దాస్ ఎల్లంకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. అలాగే సమాచార హక్కు చట్టం ప్రతినిధులు సమాజంలో చేస్తున్న సేవా కార్యక్రమాలను అభినందించారు. కార్యక్రమంలో సమాచార హక్కు చట్టం ప్రతినిధులు అంకం శ్యామ్ రావు, మటం విజయ్ కుమార్, మోతే లావణ్య, వాణి, విక్రమ్, సందీప్, ఆశ్రమం పిల్లలు, పోలీస్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.