ఎల్లారెడ్డి, ఆగష్టు 22
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ఆదివారం ఎల్లారెడ్డి మండల కేంద్రంలో ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిని ఎమ్మెల్యే జాజాల సురేందర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఎమ్మెల్యే వెంట మునిసిపల్ చైర్మన్ కుడుముల సత్యనారాయణ, కౌన్సిలర్లు ఉన్నారు.
ఆసుపత్రిలో ప్రతీ వార్డులో పర్యటించి రోగులకు వైద్యం ఎలా అందుతుంది, పారిశుద్య నిర్వహణ ఎలా ఉందో పరిశీలించారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న వారితో మాట్లాడి డాక్టర్లు అందుబాటులో ఉంటున్నారా లేదా సరైన వసతులు కల్పిస్తున్నారా అని అడిగి తెలుసుకున్నారు.
డ్యూటీ డాక్టర్లు, సిబ్బందితో మాట్లాడుతూ ప్రతి రోజు ఆసుపత్రికి వచ్చే పేద ప్రజలకు అందుబాటులో ఉంటూ మెరుగైన వైద్యం, సరైన వసతులు కల్పించాలన్నారు. ప్రతిరోజూ ఆసుపత్రిలోని అన్ని వార్డులు, మరుగుదొడ్లను పరిశుభ్రంగా ఉంచాలని ఆదేశించారు. ఆసుపత్రిలోని సిబ్బంది విధులలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే ఉపేక్షించేది లేదని హెచ్చరించారు.