కామారెడ్డి, ఆగష్టు 24
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : మంగళవారం కామారెడ్డి జిల్లా కేంద్రంలోని అశోక్ నగర్ కాలనీలో గల అఖిల భారతీయ ప్రజా సేవా సమాచార హక్కు చట్ట పరిరక్షణ కమిటీ జిల్లా కార్యాలయంలో సమావేశం నిర్వహించినట్టు జిల్లా ఇంచార్జ్, రాష్ట్ర ఉపాధ్యక్షులు అంకం శ్యామ్ రావు అన్నారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సమాచార హక్కు చట్టం 2005 ప్రతి ప్రభుత్వ కార్యాలయంలో పకడ్బందీగా అమలు చేయాలని, ఆర్‌టిఐ బోర్డులు ఏర్పాటు చేయాలన్నారు. ప్రజలుకోరిన సమాచారాన్ని 30 రోజుల్లోపు ఇవ్వాలని, వ్యక్తిగత స్వేచ్ఛకు భంగం కలిగినప్పుడు, ప్రాణహాని ఉన్నప్పుడు కేవలం 48 గంటలలో సమాచారం అధికారులు ఇవ్వాలని అన్నారు.
సమాచార హక్కు చట్టం ప్రజల చేతిలో బ్రహ్మాస్త్రం అని ప్రజలతోపాటు అధికారులు కూడా ఈ చట్టాన్ని సద్వినియోగం చేసుకొని గ్రామ పంచాయతి నుండి మొదలుకొని పార్లమెంటు వరకు అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో దరఖాస్తు చేసుకొని 30 రోజుల్లో సమాచారం తీసుకోవచ్చని అన్నారు. ఈ చట్టాన్ని ప్రజా ప్రయోజనాల నిమిత్తం సద్వినియోగం చేసుకోవాలని దుర్వినియోగం చేయకూడదని అవసరమైన సమాచారం మేరకే ప్రభుత్వ కార్యాలయాల్లో సమాచారం తీసుకోవాలని సూచించారు.
సమాచార హక్కు చట్టం 2005 ప్రకారం గ్రామ పంచాయతీలు మొదలుకొని పార్లమెంటు వరకు అన్ని ప్రభుత్వ కార్యాలయాలు ప్రతి పౌరుడు దరఖాస్తు చేసుకొని తనిఖీ చేయవచ్చన్నారు. ప్రభుత్వ కార్యాలయాలకు వెన్నెముక అయిన సమాచార హక్కు చట్టం 2005 కు సంబందించిన 4 (1) బి సంబంధించిన 17 అంశాల సమాచారం, రిజిస్టర్ 1, రిజిస్టర్ 2 న గల కాపీలను ఉచితంగా, స్వచ్చందంగా ప్రజలకు కోరినప్పుడు అధికారులు ఇవ్వాలని అన్నారు.
మూడో వ్యక్తి సమాచారం విషయంలో ప్రజా ప్రయోజనాలకు ఉపయోగపడే సమాచారం అయితే సెక్షన్ 11 (1) ప్రకారంగా దరఖాస్తుదారునికి అధికారులు సమాచారం ఇవ్వాలన్నారు. సమాచారం ఇవ్వని అధికారులకు కనిష్టంగా 250 నుండి గరిష్టంగా 25 వేల వరకు జరిమానాలు సమాచార హక్కు చట్టం రాష్ట్ర కమిషనర్ విధిస్తారు అని అన్నారు.
సమాచార హక్కు చట్టం 2005 ప్రకారం సిబిఐ, సిఐడి, కోర్టు జడ్జిమెంట్, దేశ భద్రత సమాచారం, పోలీస్ స్టేషన్ భద్రత, ఆయుధాల సమాచారాన్ని మినహాయించబడిరదన్నారు. ప్రతి ఒక్కరు ఈ చట్టాన్ని సద్వినియోగం చేసుకొని ప్రభుత్వ కార్యాలయాల్లో జరుగుతున్న అవినీతిని బయటకు తీయాలన్నారు. కార్యక్రమంలో సమాచార హక్కు చట్టం ప్రతినిధులు అంకం శ్యామ్ రావు, జాకీర్ హుస్సేన్, బాల్ రాజ్, అనూసుద్దీన్, అజామ్, ముజీబ్ ఉద్దీన్, రమేష్ తదితరులు పాల్గొన్నారు.