నిజామాబాద్, ఆగష్టు 24
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ఐ.ఎఫ్.టి.యు రాష్ట్ర సదస్సు పోస్టర్లను తెలంగాణ ప్రగతిశీల బార్ అండ్ రెస్టారెంట్ వర్కర్స్ యూనియన్ (ఐఎఫ్‌టియు) ఆధ్వర్యంలో తిలక్ గార్డెన్ వద్ద ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఐఎఫ్‌టియు నాయకులు టి.విఠల్ మాట్లాడుతూ మోడీ ప్రభుత్వం ప్రజలను యువతను దేశ భక్తి పేరుతో మాయమాటలు చెప్పి, ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేట్ కంపెనీలకు అప్పగించడానికే పనిచేస్తుందన్నారు.
మోడీ సర్కారు ఇటీవల తీసుకువచ్చిన కార్మిక వ్యతిరేక నాలుగు లేబర్ కోడ్స్ అమలును నిలిపి వేయాలన్నారు. ఈనెల 29న మంచిర్యాలలో రాష్ట్ర సదస్సు నిర్వహిస్తున్నామన్నారు. సదస్సులో ఐ.ఎఫ్.టీ.యూ జాతీయ ప్రధాన కార్యదర్శి ప్రదీప్, రాష్ట్ర, అధ్యక్ష కార్యదర్శులు వి.కృష్ణ, కే.సూర్యం, తెలంగాణలోని అన్ని జిల్లాల ఐ.ఎఫ్.టీ.యూ బాధ్యులు, కార్మికులు హాజరవుతారన్నారు.
మోడీ ప్రభుత్వం కార్మిక వ్యతిరేక విధానాలను విడనాడాలని, ప్రభుత్వ సంస్థల ప్రైవేటీకరణను మానుకోవాలన్నారు. కాంట్రాక్టు, ఔట్‌సోర్సింగ్ పద్ధతిలో పనిచేస్తున్న ఉద్యోగులు, కార్మికులకు సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని డిమాండ్ చేశారు. కేసీఆర్ ప్రభుత్వం ఎన్నికల్లో హామీ ఇచ్చిన మేరకు కాంట్రాక్ట్ కార్మికులను రెగ్యులరైజ్ చేయాలని డిమాండ్ చేశారు.
కాంట్రాక్ట్, ఔట్‌సోర్సింగ్, ఇతర కార్మికుల హక్కుల సాధన కోసం ఐ.ఎఫ్.టీ.యూ రాజీలేని పోరాటం చేస్తుందన్నారు. ఇఫ్టూ రాష్ట్ర సదస్సును జయప్రదం చేయాలని జిల్లా కార్మిక వర్గాన్ని కోరారు. పోస్టర్ల ఆవిష్కరణ కార్యక్రమంలో బార్ అండ్ రెస్టారెంట్ వర్కర్స్ యూనియన్ సంతోష్, సాయిలు, పోచయ్య, నర్సయ్య, పండరి, పోశెట్టి, గంగాధర్ తదితరులు పాల్గొన్నారు.