ఆహ్లాదకర వాతావరణంలో స్వాగతం చెప్పాలి

కామరెడ్డి, ఆగష్టు 24

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : సెప్టెంబర్‌ ఒకటవ తేదీ నుండి విద్యా సంస్థలు తిరిగి ప్రారంభం అవుతున్నందున ప్రతి పాఠశాల అద్దంలాగా తయారు కావాలని, పిల్లలకు ఆహ్లాదకర వాతావరణంలో స్వాగతం చెప్పాలని జిల్లా కలెక్టర్‌ డాక్టర్‌ ఎ.శరత్‌ అధికారులను ఆదేశించారు. సెప్టెంబరు 1వ తేదీ నుండి అన్ని విద్యా సంస్థలు ప్రారంభిస్తున్న సందర్భంగా వీడియో కాన్ఫరెన్సు ద్వారా ఎంపీపీ, ఎంపీటీసీ, జడ్పిటిసి, సర్పంచులు, విద్య, వైద్య, ఐసిడిఎస్‌, పంచాయతీ, మిషన్‌ భగీరథ, ట్రాన్స్‌కో, ఆర్డబ్ల్యూఎస్‌ అధికారులతో పాఠశాల పునః ప్రారంభ ఏర్పాట్లపై సమీక్షిస్తూ, పలు ఆదేశాలు జారీ చేశారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, పాఠశాలకు వచ్చే విద్యార్థులను ఆహ్లాదకర వాతావరణంలో ఆహ్వానించాలని, అందుకు అన్ని చర్యలు చేపట్టాలని ఆదేశించారు. తరగతి గదులు శుభ్రంగా ఉండాలని, ఫ్యాన్లు, లైట్లు పనిచేయాలని, కిటికీలు డ్యామేజ్‌ లేకుండా తెరచి మూసుకునే విధంగా ఉండాలని, ఎలాంటి బూజు ఉండరాదని, విద్యుత్‌ కనెక్షన్లు సక్రమంగా ఉండాలని, దానికి తగిన ఏర్పాట్లు చేసుకోవాలని ఆయన సూచించారు.

స్కూల్‌ వెనుక భాగంలో ఎలాంటి పిచ్చి మొక్కలు ఉండవద్దని, ముళ్ళ పొదలు తొలగించాలని, గ్రామ పంచాయతీ సిబ్బంది సహాయంతో పరిశుభ్రత చర్యలు చేపట్టాలని, నీరు నిలబడకుండా చర్యలు తీసుకోవాలని తెలిపారు. విద్యార్థులు చిన్నపిల్లలు కాబట్టి, వారి ఆరోగ్యం కోసం కోసం అన్ని స్థాయిలలో మంచి వాతావరణం ఏర్పరచాలని, పనులలో ఎలాంటి అశ్రద్ద వహించినా కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని అన్నారు. పాఠశాల ఆవరణలో పరిశుభ్రతతో పాటు పచ్చదనానికి చర్యలు తీసుకోవాలని సూచించారు.

పంచాయతీ సెక్రెటరీ, వీఆర్వోల సహాయంతో గ్రామాలలో పాఠశాలలు తిరిగి ప్రారంభం అవుతున్నాయని, టీచర్లు అందరూ అందుబాటులో ఉంటారు అనే విషయాలను ప్రజలకు స్పష్టంగా తెలిసే విధంగా టాం టాం చేయించాలని, దీనికి ప్రజాప్రతినిధుల సహకారం తీసుకోవాలని తెలిపారు. విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వ ఆదేశాల ప్రకారం రేపటినుండి ఉపాధ్యాయులు వంద శాతం హాజరు కావాలని ఆయన ఆదేశించారు.

పాఠశాలల్లో కిచెన్‌ షెడ్స్‌ పరిశుభ్రంగా ఉంచాలని, మిడ్‌ డే మీల్స్‌ ఏజెన్సీలను సిద్ధం చేయాలని తెలిపారు. పాఠశాలలోని ప్రతి నీటి ట్యాంకును శుభ్రంగా కడిగించి క్లోరినేషన్‌ చేపట్టాలని, దెబ్బతిన్న నల్లాలను మార్చాలని తెలిపారు. సివిల్‌ సప్లై అధికారుల నుండి నిబంధనల ప్రకారం మధ్యాహ్న భోజన బియ్యం పొందాలని సూచించారు. ఎఎన్‌ఎం, ఆశా సిబ్బంది ప్రతి రోజూ సంబంధిత పాఠశాల సందర్శించి విద్యార్థులను పరీక్షిస్తుండాలని తెలిపారు.

గదులలో ధారాళంగా గాలి, వెలుతురు వచ్చేలా ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. జిల్లా స్థాయి కంట్రోల్‌ రూమ్‌ ఏర్పాటు చేయడం జరిగిందని, విద్య, వైద్యం, మంచినీరు, తదితర సమస్యలను కంట్రోల్‌ రూమ్‌ దృష్టికి తేవాలని తెలిపారు. ఎంపీపీ, ఎంపిడిఓ, ఎంఈఓ క్షేత్ర స్థాయిలో అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ఒక పండుగ వాతావరణంలో పాఠశాలలు తిరిగి ప్రారంభించుకోవాలని అన్నారు.

విద్యార్థులలో ఎవరికైనా కోవిద్‌ లక్షణాలు ఉంటే ఐసొలేషన్‌, ట్రాకింగ్‌, కిట్స్‌ పంపిణీ వంటి జాగ్రత్తలు పాటించాలని తెలిపారు. కార్యక్రమంలో జిల్లా స్థానిక సంస్థల అదనపు కలెక్టర్‌ వెంకటేశ్‌ ధోత్రే, కామారెడ్డి మున్సిపల్‌ చైర్‌ పర్సన్‌ నిట్టు జాహ్నవి, జిల్లా అధికారులు, మున్సిపల్‌ కమిషనర్లు పాల్గొన్నారు.

Check Also

నేటి పంచాంగం

Print 🖨 PDF 📄 eBook 📱 శనివారం, నవంబరు 23, 2024శ్రీ క్రోధి నామ సంవత్సరందక్షిణాయణం – శరదృతువుకార్తీక …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »