నిజామాబాద్, ఆగష్టు 25
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ఫీజుల దోపిడీ నియంత్రించాలని, ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక సదుపాయాలు కల్పించాలని ప్రగతిశీల ప్రజాస్వామ్య విద్యార్థి సంఘం (పిడిఎస్‌యు) జిల్లా విద్యాధికారి (డిఇవో)కి వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా పి.డి.ఎస్.యు జిల్లా అధ్యక్షురాలు సీ.హెచ్ కల్పన మాట్లాడుతూ సెప్టెంబర్ 1 నుండి తరగతులు ప్రారంభమౌవుతున్న నేపథ్యంలో ప్రభుత్వ పాఠశాలల్లో కనీస మౌలిక వసతులైన స్వచ్ఛమైన తాగునీరు, మరుగుదొడ్ల సదుపాయాలు కల్పించాలన్నారు.
భవనాల అన్నిరకాల మరమ్మతులు పూర్తి చేయించాలన్నారు. ఇప్పటికీ అన్ని పాఠశాలలకు పూర్తిస్థాయిలో పాఠ్యపుస్తకాలు, యూనిఫాంలు అందలేదని, విద్యార్థులందరికీ అందజేయాలన్నారు. స్కూళ్లు ప్రారంభమవుతున్నాయని ప్రభుత్వం ప్రకటించగానే, ప్రైవేటు యాజమాన్యాలు ఫీజుల వసూళ్లకు పాల్పడుతున్నాయన్నారు. ప్రైవేట్ విద్యాసంస్థల్లో అధిక, అక్రమ ఫీజుల దోపిడీని నియంత్రించాలన్నారు.
ప్రభుత్వ ఆదేశాల మేరకు నెలవారీగా మాత్రమే ట్యూషన్ ఫీజులు అడిగేలా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. నిబంధనలు పాటించని ప్రైవేటు విద్యాసంస్థలపై చర్యలు తీసుకోవాలన్నారు. జిల్లా నాయకులు ప్రశాంత్, నగర నాయకులు రమేష్, సాయితేజ పాల్గొన్నారు.