కామారెడ్డి, ఆగష్టు 25
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : జిల్లాలోని ప్రతి పాఠశాలలో పరిశుభ్రత, పచ్చదనం కలిగి ఉండే విధంగా గ్రామ పంచాయతీ అధికారులు చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎ.శరత్ ఆదేశించారు. బుధవారం దోమకొండ, బీబీపేట మండల కేంద్రంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలను ఆయన సందర్శించారు. దోమకొండ ప్రభుత్వ పాఠశాలను పరిశీలించారు. మరుగుదొడ్ల సమీపంలో పిచ్చి మొక్కలు పెరిగాయి. వాటిని తక్షణమే తొలగించే విధంగా చర్యలు చేపట్టాలని పంచాయతీ అధికారులను ఆదేశించారు. పరిసరాలు పరిశుభ్రంగా ఉండేవిధంగా చూడాలన్నారు.
ప్రతి పాఠశాలకు పారిశుద్ధ్య కార్మికులను నియమించాలని పేర్కొన్నారు. ప్రతి పాఠశాలలో 400 మొక్కలు నాటే విధంగా చూడాలన్నారు. విద్యుత్తు, తాగునీరు సమస్యలు లేకుండా చూసుకోవాలని ఉపాధ్యాయులకు సూచించారు. మధ్యాహ్న భోజనం సంబంధించి సామాగ్రిని సిద్ధం చేసుకోవాలని తెలిపారు. పాఠశాలల్లో అపరిశుభ్రత వాతావరణం, శిధిలమైన నిర్మాణాలు లేకుండా చూడాలన్నారు.
సెప్టెంబర్ 1న పండుగ వాతావరణంలో పాఠశాలలు పునః ప్రారంభించాలని పేర్కొన్నారు. తల్లిదండ్రులు తప్పనిసరిగా పిల్లలు మాస్కులు ధరించే విధంగా చూడాలని కోరారు. విద్యార్థులు తరగతి గదుల్లో భౌతిక దూరం పాటిస్తూ కూర్చునే విధంగా ప్రధానోపాధ్యాయులు చూడాలని కోరారు. దోమకొండ గ్రామపంచాయతీని ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దడానికి గడికోట ట్రస్ట్ ఆధ్వర్యంలో ప్రణాళికలు సిద్ధం చేయాలని సూచించారు.
పంచాయతీ సర్పంచి, మండల స్థాయి అధికారులతో కలెక్టర్ చర్చించారు. బీబీపేటలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని సందర్శించారు. 65 శాతం మందికి కోవిడ్ వ్యాక్సినేషన్ పూర్తి చేసినట్లు వైద్య అధికారిని శ్వేత తెలిపారు. ఆస్పత్రి ఆవరణలో పిచ్చి మొక్కలు లేకుండా చూడాలని కోరారు. జిల్లాలో 70 శాతం మంది పిల్లలకు నిమోనియా వ్యాధి రాకుండా నిరోధక టీకాలు వేసినట్లు తెలిపారు.
పాఠశాలలను ఆరోగ్య కార్యకర్తలు సందర్శించి మాస్కులు, శానిటైజర్ బాటిళ్లనును ప్రధానోపాధ్యాయులకు అందించాలని సూచించారు. అవెన్యూ ప్లాంటేషన్లో పలుచోట్ల ట్రీ గార్డులు కిందపడిపోయి ఉన్నాయని, వాటిని తక్షణమే బాగు చేయాలని పేర్కొన్నారు. ఈ నెల 30 లోగా మొక్కలు సక్రమంగా ఉండే విధంగా చూసుకోవాలన్నారు. కార్యక్రమంలో ఎంపీడీవోలు దోమకొండ, బీబీ పేట చెన్నారెడ్డి, నారాయణ, దోమకొండ సర్పంచ్ అంజలి, జెడ్పిటిసి సభ్యుడు తిరుమల గౌడ్, ఎంపీవోలు, మండల స్థాయి అధికారులు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.