నిజామాబాద్, ఆగష్టు 25
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : 57 సంవత్సరాల వయసు దాటిన వారు ఆసరా పింఛన్ గురించి దరఖాస్తు చేసుకునే సమయంలో మీ సేవా కేంద్రాలలో దరఖాస్తుతోపాటు ఓటర్, తెల్ల రేషన్ కార్డు, ముద్రల కొరకు ఆధార్ కార్డు జిరాక్స్ కాపీలు మీ-సేవ కేంద్రాలకు తీసుకొని పోవాలని జిల్లా కలెక్టర్ నారాయణ రెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు.
మీ సేవ కేంద్రాలలో దరఖాస్తుదారుల నుండి ఆదాయ, కుల ధ్రువ పత్రాలు డిమాండ్ చేయవద్దని ఆయన నిర్వహణ దారులను ఆదేశించారు. దరఖాస్తులను ఉచితంగానే ప్రాసెస్ చేయాలని, ఒకవేళ మీ సేవా కేంద్రాలలో దరఖాస్తుదారుల నుండి ఫీజులు వసూలు చేస్తే సంబంధిత కేంద్రాలపై తప్పనిసరి చర్యలు ఉంటాయని హెచ్చరించారు.
ప్రజలు ఈ విషయాన్ని గమనించి ఆందోళనకు గురికాకుండా ఈ నెల 31 లోపు మీసేవ కేంద్రాలలో దరఖాస్తు చేసుకోవాలని ప్రకటనలో కోరారు. రాష్ట్ర వ్యాప్తంగా ఆసరా పెన్షన్‌ల కోసం వచ్చిన దరఖాస్తులలో నిజామాబాద్ జిల్లాలో అత్యధికంగా 34 వేల 545 వచ్చాయని, రాష్ట్రం మొత్తంలో 4 లక్షల 83 వేల 107 దరఖాస్తులు వచ్చాయని కలెక్టర్ వివరించారు.