నిజామాబాద్, ఆగష్టు 26
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డిని ఉద్దేశించి మంత్రి మల్లారెడ్డి చేసిన అనుచిత వ్యాఖ్యలను ఖండిస్తూ నిజామాబాద్ ఎన్‌ఎస్‌యుఐ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో నగరంలోని ఎన్టీఆర్ చౌరస్తా వద్ద మంత్రి మల్లారెడ్డి చిత్రపటానికి చెప్పుల దండ వేసి అనంతరం దిష్టిబొమ్మను దహనం చేశారు.
ఈ సందర్బంగా ఎన్. ఎస్.యు.ఐ నిజామాబాద్ జిల్లా అధ్యక్షుడు వరదబట్టు వేణురాజ్ మాట్లాడుతూ మంత్రి మల్లారెడ్డి తమ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి పై చేసిన వ్యాఖ్యలను వెంటనే వెనక్కి తీసుకొని రేవంత్ రెడ్డికి బేషరతుగా క్షమాపణ చెప్పాలని, లేనిపక్షంలో మంత్రి మల్లారెడ్డి ఇంటిని ముట్టడిస్తామని హెచ్చరించారు. మంత్రి మల్లారెడ్డి తాను ఒక మంత్రిననే విషయాన్ని మర్చిపోయి వీధి రౌడీల్లా మాట్లాడుతున్నారని ఆయన మాట్లాడిన విధానం ప్రజాస్వామ్య విరుద్ధమని ఒక జాతీయ పార్టీ కి రాష్ట్ర అధ్యక్షుడిగా, దేశంలోనే అతిపెద్ద పార్లమెంట్ నియోజకవర్గానికి పార్లమెంట్ సభ్యుడిగా ఉన్న వ్యక్తిపై అసభ్య పదజాలంతో మాట్లాడిన తీరును బట్టి చూస్తే ఆయన మానసిక పరిస్థితి సరిగా లేదని అర్థమవుతుందన్నారు.
మంత్రి స్థాయిలో ఉండి ఆయన వాడిన భాష అనాగరికులను తలపిస్తుందని, జనంలో కాంగ్రెస్ పార్టీకి, రేవంత్ రెడ్డికి పెరుగుతున్న ఆదరణ చూసి ఓర్వలేక రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ మంత్రి మల్లారెడ్డి లాంటి వాళ్లను రేవంత్ రెడ్డిపైకి ఉసిగొలుపుపోతున్నాడని అన్నారు. రేవంత్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ నాయకులు ఇలాంటి తాటాకు చప్పుళ్ళకు భయపడరని ఇకనైనా మంత్రి మల్లారెడ్డి ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడితే మంచిదని లేనిపక్షంలో తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుందని ధ్వజమెత్తారు.
కార్యక్రమంలో నిజామాబాద్ ఎన్‌ఎస్‌యుఐ జిల్లా ప్రధాన కార్యదర్శి నరణ్ దీప్, నాయకులు సన్నీ, అరవింద్, ప్రదీప్, సాయి, వంశీ, గణేష్, ప్రణయ్, మల్లేష్ తదితరులు పాల్గొన్నారు.