కామారెడ్డి, ఆగష్టు 27
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : తెలంగాణలో సార్వత్రిక ఎన్నికలకు ఇంకా రెండేళ్ల సమయం ఉంది, ఇక ఇప్పటి నుంచే కాంగ్రెస్ పార్టీ చక చక పావులు కదుపు తుంది. ఈ క్రమంలో పలు పార్టీల నుంచి కాంగ్రెస్ పార్టీలోకి భారీగా చేరికలు జరుగుతున్నాయి. ముఖ్యంగా అధికార తెరాస పార్టీకి వ్యతిరేక పవనాలు వీస్తున్న క్రమంలో భారీగా కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నారు.
ఈ క్రమంలో శుక్రవారం కామారెడ్డి జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో మాజీ మంత్రి మాజీ మండలి ప్రతిపక్ష నేత మహమ్మద్ అలీ షబ్బీర్ సమక్షంలో మాచారెడ్డి మండలం రత్నగిరి పల్లి నుండి దాదాపు 100 మంది కాంగ్రెస్ పార్టీలో చేరారు.
ఈ సందర్భంగా షబ్బీర్ అలీ మాట్లాడుతూ అధికార పార్టీకి వ్యతిరేక పవనాలు వీయడంతో కేసీఆర్ తాయిలాలు ఇవ్వడం మొదలు పెట్టారని, తాజాగా హుజురాబాద్ ఉపఎన్నికల కోసం దళిత బందు అంటు ఒక పథకం పెట్టి ఒక్క ఆ నియోజకవర్గ దళితుల కోసం 2 వేల కోట్లు ప్రకటించాడన్నారు. అయినప్పటికీ కొంత మంది దళితులు, గిరిజనులు కేసీఆర్కు వ్యతిరేకంగానే ఉన్నారన్నారు. త్వరలో అధికార పార్టీకి చెందిన సర్పంచులు, ఎంపీటీసీలు భారీగా కాంగ్రెస్ తీర్థం పుచ్చుకోనున్నట్టు షబ్బీర్ పేర్కొన్నారు.