నిజామాబాద్, ఆగష్టు 27
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ఆర్‌అండ్‌బి శాఖ ఆధ్వర్యంలో నాటిన హరితహారం మొక్కలు నిర్వహణ బాగుందని అధికారులు ప్రత్యేక శ్రద్ధ కనబడినట్లు కనిపిస్తుందని జిల్లా కలెక్టర్ నారాయణ రెడ్డి అన్నారు.
శుక్రవారం ప్రగతి భవన్ సమావేశ మందిరంలో హరితహారంపై ఆర్‌అండ్‌బి శాఖ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎస్సారెస్పీ ప్రాజెక్ట్ గతంలో 20-30 సంవత్సరాల క్రితం జులై మాసంలో గేట్లు తీసారని మళ్లీ ఎన్ని సంవత్సరాలకు హరితహారం ప్రభావంతో జులై ఆగస్టు నెలల్లో పలుమార్లు ప్రాజెక్ట్ ఉండడంవల్ల గేట్లు ఎత్తడం జరిగిందని అన్నారు. గత ఏడు విడతలుగా నిర్వహించిన హరితహారం కార్యక్రమంలో కోట్ల కొలది మొక్కలు నాటడంతో విస్తీర్ణం పెరిగి వాతావరణంలో సమతుల్యత ఏర్పడి రాష్ట్రంలో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయన్నారు.
కావున ప్రతి ఒక్కరూ హరితహారంపై దృష్టి పెట్టాలని ఆదేశించారు. జిల్లాలో ఉన్న ఆర్‌అండ్‌బి రోడ్లకు ఇరువైపులా మొక్కలు తప్పక ఉండాలని అన్ని మొక్కలు పెద్దవి మాత్రమే నాటాలని, ఆర్‌అండ్‌బి వారు దృష్టి పెట్టినప్పటి నుండి చాలా మొక్కలు పెరుగుతున్నవని తనిఖీలకు వెళ్ళినపుడు గమనించడం జరిగిందన్నారు. చాలా బాగా పర్యవేక్షణ చేస్తున్నారని చెప్పారు. మోర్తాడ్, పాలెం, తొర్తి, డిచ్‌పల్లి పర్యటనలలో పరిశీలన సందర్భంగా గమనించడం జరిగిందన్నారు.
జిల్లాలో ఉన్న ప్రతి ఆర్‌అండ్‌బి రోడ్‌కు ఇరువైపులా మొక్కలు ఉండాలని ఎక్కడ కూడా ఖాళీ స్థలం ఉండకూడదని అధికారులను ఆదేశించారు. ఒక సంవత్సరం పాటు ప్రతి అధికారి హరితహారంపై మానిటర్ చేస్తే చెట్లు చనిపోకుండా ఉంటాయని, కావున ప్రతి అధికారి ఫీల్డ్‌కు వెళ్ళినప్పుడు రెగ్యులర్ పనులతో పాటు మొక్కలను చూడాలని ఆదేశించారు. కొన్ని ప్రాంతాల్లో వాటర్ సరిగా అందడం లేదని అధికారులు కలెక్టర్ దృష్టికి తేగా ఏమైనా సమస్యలుంటే డిపిఓకు తెలియజేయాలని అధికారులను ఆదేశించారు. కార్యక్రమంలో అడిషనల్ కలెక్టర్ చిత్ర మిశ్రా, ఆర్‌అండ్‌బి ఈ.ఈ. రాంబాబు, డిఈలు, ఏఈలు, డిపిఓ జయసుధ తదితరులు పాల్గొన్నారు.