నిజామాబాద్, ఆగష్టు 27
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : కార్మికుల పట్ల ప్రావిడెంట్ ఫండ్ కార్యాలయం రీజనల్ కమీషనర్ సుశాంత్ పాదే మొండి వైఖరిని ఖండిస్తూ తెలంగాణ ప్రగతిశీల బీడీ వర్కర్స్ యూనియన్ (ఐ.ఎఫ్.టీ.యూ) ఆధ్వర్యంలో పీ.ఎఫ్ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించి, కమిషనర్‌ని ఘెరావ్ చేశారు.
ఈ సందర్భంగా ఐ.ఎఫ్.టీ.యూ రాష్ట్ర అధ్యక్షులు వనమాల కృష్ణ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో బీడీ పరిశ్రమలో పనిచేసే కార్మికుల పీ.ఎఫ్ రికార్డులు ఆధార్, బ్యాంక్ ఖాతా రికార్డులతో సరిపోలక, సకాలంలో కేవైసి, ఈ-నామినేషన్ చేయించడంలో అనేక ఇబ్బందులు పడుతున్నారన్నారు. ఈ విషయమై రీజనల్ కమిషనర్ సుశాంత్ పాదేని అపాయింట్మెంట్ తీసుకొని, కలవడానికి వెళ్లిన యూనియన్ రాష్ట్ర నాయకత్వ బృందంతో కమిషనర్ దురుసుగా ప్రవర్తించడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు.
కార్మికుల గురించి యూనియన్ నాయకులు మాట్లాడే హక్కు లేదని, బయటకు వెళ్లండని కమీషనర్ దురుసుగా ప్రవర్తించారన్నారు. కార్మికుల గురించి యూనియన్ నాయకులు మాట్లాడే హక్కు లేదనడం కార్మిక చట్టాలను ఉల్లంఘించడమేనని అన్నారు. అధికారులు ప్రజలకు, కార్మికులకు సేవకులు మాత్రమేనన్న విషయాన్ని మరువరాదని హితవు పలికారు.
కమిషనర్ గారు తన వైఖరిని మార్చుకోవాలని హితవు పలికారు. వెంటనే రీజినల్ కమిషనర్ క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. భవిష్యత్తులో ఇదే వైఖరి కొనసాగితే, కమిషనర్ వైఖరికి నిరసనగా మరింత పెద్దఎత్తున ఆందోళనలు నిర్వహిస్తామని హెచ్చరించారు. తమ పేర్ల తప్పుల సవరణ కోసం వేలాది మంది బీడీ కార్మికులు పీ.ఎఫ్ కార్యాలయంలో దరఖాస్తు చేసుకున్నారని, అవి ఇంకా పెండిరగ్‌లో ఉన్నాయన్నారు. తప్పుల సవరణలకు దరఖాస్తు చేసుకోని కార్మికులు కూడా వేలాదిగా ఉన్నారన్నారు. వీరందరికీ బీడీ యాజమాన్యాలు ధ్రువీకరించిన ప్రకారం, గెజిట్ నోటిఫికేషన్, ఆధార్ కార్డుల ఆధారంగా పీ.ఎఫ్ రికార్డులను సరిచేయాలని కోరుతున్నామన్నారు.
ఈ సమస్యలను వీలైనంత త్వరగా పరిష్కరించాలని, లేనిచో ఆందోళనను తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు. రీజినల్ కమిషనర్, అసిస్టెంట్ కమిషనర్లు యూనియన్ నాయకత్వాన్ని పిలిచి చర్చలు జరిపి సమస్యలు పరిష్కరిస్తామని హామీ ఇవ్వడంతో ధర్నా విరమించారు. కార్యక్రమంలో యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎం.నరేందర్, ఉపాధ్యక్షులు రాజన్న, ఎం.ముత్తెన్న, జిల్లా అధ్యక్షులు డి.రాజేశ్వర్, మల్లేష్, కిషన్, సత్తెక్క, సూర్యశివాజీ, సుధాకర్, రమేష్, చరణ్, బాలక్రిష్ణ, అఫ్జల్, గంగాధర్, రాజ్ మహమ్మద్, లక్ష్మీ, గంగమణి, సుశీల, బీడీ కార్మికులు పాల్గొన్నారు.