కామారెడ్డి, ఆగష్టు 29
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ఆదివారం కామారెడ్డి జిల్లా బిక్నూర్ మండల కేంద్రంలోని సిద్ధార్థ విద్యాలయంలో తెలుగు భాషా పితామహుడు గిడుగు వెంకట రామమూర్తి, హాకీ మాంత్రికుడు క్రీడాకారుడు ధ్యాన్ చంద్ జయంతి సందర్భంగా అఖిల భారతీయ ప్రజా సేవా సమాచార హక్కు చట్ట పరిరక్షణ కమిటీ ఆధ్వర్యంలో జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించినట్టు జిల్లా ఇంచార్జ్ రాష్ట్ర ఉపాధ్యక్షులు అంకం శ్యామ్ రావు అన్నారు.
ఈ సందర్భంగా శ్యాంరావు మాట్లాడుతూ మహనీయులను మరువద్దని ప్రతి ఒక్కరూ వారిని స్మరించుకోవాలని అన్నారు. హాకీ క్రీడాకారుడు ధ్యాన్ చంద్ జయంతిని జాతీయ క్రీడా దినోత్సవంగా జరుపుకోవడం ఆనవాయితీగా వస్తుందని భారత క్రీడాకారులకు పరిచయం అక్కర్లేని పేరు ధ్యాన్ చంద్ అని, 1928 ఆమ్ స్టర్ డామ్ ఒలంపిక్స్, 1932 సంవత్సరంలో లాస్ ఎంజెలిస్, 1936లో బెర్లిన్ ఒలంపిక్స్‌లో భారత్ వరుసగా మూడు బంగారు పతకాలు గెలుచుకోవడంలో ధ్యాన్ చంద్ ప్రధాన పాత్ర పోషించారని అన్నారు. 1905 ఆగస్టు 29 నాడు మహనీయుడు ధ్యాన్ చంద్ జన్మదినం పురస్కరించుకొని ఆయనను గౌరవిస్తూ జాతీయ క్రీడా దినోత్సవం జరుపుకుంటారని ప్రతి ఒక్కరు ఆయన బాటలో నడవాలి అన్నారు.
తెలుగు భాషా దినోత్సవం సందర్భంగా తెలుగులో వాడుక భాషా ఉద్యమ పితామహుడు మహనీయుడు గిడుగు వెంకట రామమూర్తి గ్రాంధిక భాషలో ఉన్న తెలుగు వచనాన్ని ప్రజల వాడుకభాషలోకి తీసుకువచ్చి నిత్య వ్యవహారంలోని భాషలో ఉన్న అందాన్ని వీలునూ తెలియజెప్పిన మహనీయుడు అని అన్నారు. గిడుగు వెంకట రామమూర్తి జయంతి పురస్కరించుకొని గౌరవిస్తూ ఆగష్టు 29 తెలుగు భాషా దినోత్సవంగా జరుపుకుంటారని అన్నారు.
కార్యక్రమంలో సమాచార హక్కు చట్టం ప్రతినిధులు దాసరి నాగరాజు, మోతే లావణ్య, పుట్ట రమేష్, భాస్కర్, దేవర పరమేష్, పర్వత రావు, స్వామి, శ్రీనివాస్, బాబు తదితరులు పాల్గొన్నారు.