కామారెడ్డి, ఆగష్టు 30
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : కామారెడ్డి ప్రభుత్వ డిగ్రీ కళాశాలకు కేంద్ర విద్యాశాఖ వారి గ్రీన్ ఛాంపియన్ అవార్డు లభించింది. ఈ మేరకు మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ విద్యా మండలి తరపున సర్టిఫికెట్ అందించారు. ధ్రువపత్రాన్ని కామారెడ్డి జిల్లా అదనపు కలెక్టర్ వెంకటేశ్ దోత్రే ప్రిన్సిపాల్, అధ్యాపకులకు అందజేశారు.
పచ్చదనం పెంపొందించుట, నీటి సంరక్షణ కొలనులు ఏర్పాటు చేయుట, పారిశుద్ధ్య నిర్వహణ, నీటి వనరుల వినియోగం వంటి అంశాలలో జిల్లా స్థాయిలో మేటిగా నిలిచినందున అవార్డు అందించారు. ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ వెంకటేశ్ దోత్రే మాట్లాడుతూ కామారెడ్డిలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలకు జాతీయ స్థాయి గుర్తింపు రావడం గర్వకారణం అన్నారు.
కార్యక్రమంలో ప్రిన్సిపాల్ ఎం. చంద్రకాంత్, అధ్యాపకులు, రాశివనం కన్వీనర్ డాక్టర్ వి.శంకర్ ఎన్ఎస్ఎస్ ప్రోగ్రాం అధికారి టి. వెంకటేశ్వర్లు పాల్గొన్నారు.