భారీ వర్ష సూచన, రెండు రోజులు అత్యంత అప్రమత్తంగా ఉండాలి

నిజామాబాద్‌, ఆగష్టు 30

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : రాష్ట్రంలో ముఖ్యంగా నిజామాబాద్‌ జిల్లాతో కలిపి ఉత్తర తెలంగాణ జిల్లాల్లో రెండు మూడు రోజులపాటు భారీ వర్ష సూచన ఉన్నట్లు వాతావరణ శాఖ హెచ్చరించినందున జిల్లాలో అన్ని శాఖల అధికారులు అవసరమైన అన్ని ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని ప్రజలు ప్రమాదాలకు గురి కాకుండా అప్రమత్తంగా ఉండేలా చూడాలని ఎక్కడ కూడా ఆస్తి, ప్రాణనష్టం జరగకుండా ముందు జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులకు గ్రామ స్థాయి నుండి జిల్లా స్థాయి వరకు ఎవ్వరికి కూడా సెలవులు లేవని మంగళవారం కూడా అందరు విధులలో ఉండాలని ప్రతి ఒక్కరు హెడ్‌ క్వార్టర్స్‌ మెయింటెన్‌ చేయాలని జిల్లా కలెక్టర్‌ నారాయణ రెడ్డి ఆదేశించారు.

సోమవారం కలెక్టరేట్‌ నుండి ఆయన సంబంధిత అధికారులతో సెల్‌ కాన్ఫరెన్సు నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ సోమవారం రాత్రి మంగళవారం ఆ తర్వాత మరో రోజు కూడా భారీ వర్షాలు ఉన్నట్లు సూచనలు వస్తున్నందున అన్ని శాఖల అధికారులు అప్రమత్తంగా ఉండాలని వారి పరిధిలో నిర్వహించవలసిన అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని ఎక్కడ కూడా సమస్యలు రాకుండా అత్యంత జాగ్రత్తగా అప్రమత్తంగా ఉండాలని స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. అన్ని స్థాయిల్లో అధికారులు, ఉద్యోగులు తమ హెడ్‌ క్వార్టర్‌ లలో అందుబాటులో ఉండాలని ఎవరికి కూడా సెలవులు లేవని ఇప్పటికే మంజూరు అయిన వారు ఉంటే కూడా వెంటనే హెడ్‌ క్వార్టర్స్‌ కు తిరిగి రావాలని స్పష్టం చేశారు.

నీటిపారుదల, విద్యుత్తు, వ్యవసాయ, పోలీస్‌, అగ్నిమాపక, ఫిషరీస్‌, మున్సిపల్‌, పంచాయతీ రాజ్‌, ఆర్‌అండ్‌బి తదితర శాఖల అధికారులు మరింత అప్రమత్తంగా ఉండాలన్నారు. ఎక్కడైనా చెరువులు కానీ ప్రాజెక్టు కానీ కాలువలు కానీ ప్రమాదానికి గురి అయ్యే అవకాశం ఉంటే ముందస్తు మరమ్మతులు చేయాలని ఇసుక సంచులు సిద్ధంగా ఉంచాలని పేర్కొన్నారు. ప్రమాదాలు జరిగిన చోట సమాచారం రాగానే అత్యంత వేగంగా హాజరై ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాలని నష్టాలు జరగకుండా చూడాలని పేర్కొన్నారు.

మనుషుల జంతువులకు సంబంధించి ఒక్క ప్రాణ నష్టం కూడా జరగకుండా చూడాలన్నారు. ఆర్‌అండ్‌బి పంచాయతీ రాజ్‌ రోడ్లు ఎక్కడైనా దెబ్బతింటే వెంటనే మరమ్మతులు చేయించాలన్నారు. వరదలు వచ్చే చోట లోతట్టు ప్రాంతాల ప్రజలను ముందుగానే సురక్షిత ప్రాంతాలకు తరలించాలని ఆర్‌డివోలు తహసీల్దార్లను ఆదేశించారు. మున్సిపాలిటీలు గ్రామ పంచాయతీలలో నీరు నిలువకుండా సాఫీగా వెళ్లే విధంగా అవసరమైన చోట కచ్చా కాలువలు తీయించాలన్నారు.

పాత భవనాలు ఎక్కడైనా ప్రమాదకరంగా ఉంటే అందులో ఉండే వారిని వేరే చోటకు తరలించాలని అదేవిధంగా శిధిలావస్థలో ఉన్న పాఠశాలలో విద్యార్థులను కూర్చోపెట్టవద్దని పేర్కొన్నారు. కలెక్టరేట్‌లో 24 గంటల పాటు కంట్రోల్‌ రూమ్‌ పనిచేస్తుందని అధికారులు అవసరమైన సమాచారాన్ని కంట్రోల్‌ రూమ్‌కి అందించి మిగతా అధికారులను అప్రమత్తం చేసే విధంగా చూడాలన్నారు.

సెప్టెంబర్‌ 1 నుండి పాఠశాలలు, కాలేజీలు ప్రారంభం అవుతున్నందున అంతటా కోవిడ్‌ నిబంధనలు పక్కాగా అమలయ్యేలా ప్రతి పనికి ఒక ఉపాధ్యాయుడిని ఇన్చార్జిగా నియమించాలని ప్రతి చోట సోషల్‌ డిస్టెన్స్‌ పాటించే విధంగా చూడాలని శుభ్రత, పారిశుద్ధ్యం పాటించే విధంగా అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని, జిల్లా స్థాయి, మండల స్థాయి అధికారులు బుధవారం నుండి నాలుగు రోజులపాటు ఉదయం 9 గంటల నుండి పాఠశాలల్లో పర్యటించి పరిస్థితులను పర్యవేక్షించాలని ఆదేశించారు.

పోలీస్‌ కమిషనర్‌ కార్తికేయ మాట్లాడుతూ శాఖ తరపున అందరూ ఎస్‌.హెచ్‌.ఓలను అప్రమత్తం చేయడం జరిగిందని, తమ తరఫున ఏ సహకారం కావాలన్నా సంబంధిత అధికారులు సంప్రదించాలని సూచించారు. కాన్ఫరెన్సులో అదనపు కలెక్టర్లు చిత్ర మిశ్రా, చంద్రశేఖర్‌, మున్సిపల్‌ కమిషనర్‌ జితేష్‌, ట్రాన్స్‌కో ఎస్‌ఇ సుదర్శన్‌ , ఆర్‌డివోలు రాజేశ్వర్‌, రవి, శ్రీనివాస్‌, సంబంధిత శాఖల అధికారులు హాజరయ్యారు.

Check Also

దివ్యాంగులకు క్రీడా పోటీలు

Print 🖨 PDF 📄 eBook 📱 నిజామాబాద్‌, నవంబర్‌ 21 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : జిల్లా …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »