నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : పంచాయతీ కార్యదర్శులు ప్రతిరోజు సమయానుకూలంగా పనిచేసే విధంగా చూడాలని జిల్లా స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ వెంకటేష్ ధోత్రే అన్నారు. సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలో సోమవారం మండల పంచాయతీ అధికారులతో సమీక్ష నిర్వహించారు. ప్రతిరోజు వాట్సప్ ద్వారా ఉదయం ఎనిమిది గంటలకు మండల పంచాయతీ అధికారులు హాజరు తీసుకోవాలని సూచించారు.
గ్రామాల్లో పారిశుద్ధ్య కార్యక్రమాలు సక్రమంగా చేపట్టే విధంగా చూడాలన్నారు. పైప్లైన్ లీకేజీలు, మురుగు నీటి గుంతలు లేకుండా చూడాలని పేర్కొన్నారు. డెంగ్యూ రాకుండా గ్రామాల్లో ఫాగింగ్ చేపట్టాలని ఆదేశించారు. సేంద్రియ ఎరువులు విక్రయించి పంచాయతీల ఆదాయాన్ని పెంపొందించుకోవాలని కోరారు. సమావేశంలో డిపిఓ సునంద, డిఎల్పివోలు రాజేంద్ర ప్రసాద్, శ్రీనివాస్, సాయిబాబా, ఎంపీవోలు పాల్గొన్నారు.