కామారెడ్డి, ఆగష్టు 31
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : సెప్టెంబర్ 1 వ తేదీ నుండి 31 వ తేదీ వరకు జాతీయ పోషణ మాసం సందర్భంగా, మహిళాభివృద్ధి శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో జిల్లాలో నాల్గవ రాష్ట్రీయ పోషణ మాసం కార్యక్రమాలు నిర్వహించబడుతాయని జిల్లా మహిళా శిశు సంక్షేమ శాఖ అధికారి సరస్వతి ఒక ప్రకటనలో తెలిపారు.
రాష్ట్ర స్త్రీ శిశు సంక్షేమ శాఖ కమిషనర్ నుండి కార్యాచరణ ప్రణాళిక, ఆదేశాలు జారీచేయబడినాయని, జిల్లా కలెక్టర్ అధ్యక్షతన పోషణ మాసం కార్యక్రమాల అమలు, పర్యవేక్షణపై సంబంధిత లైన్ డిపార్ట్‌మెంట్లతో సమన్వయ సమావేశం ఏర్పాటుచేసి జిల్లాలో పోషణమాసం కార్యక్రమాలు నిర్వహించబడుతాయని తెలిపారు.
సెప్టెంబర్ నెలలో నాలుగు వారాలకు సంబంధించిన కార్యాచరణ ప్రణాళిక మేరకు జిల్లా స్థాయి, ఐసీడీఎస్ ప్రాజెక్ట్ స్థాయి, గ్రామ స్థాయిలో వివిధ కార్యక్రమాలు నిర్వహించబడుతాయని, పిల్లల పెరుగుదలకు సంబంధించి ప్రత్యేక పెరుగుదల పర్యవేక్షణ డ్రైవ్ ద్వారా లోప పోషణ గల పిల్లలను గుర్తించి తగు చర్యలు తీసుకోవడం, అంగన్‌వాడి కేంద్రాల్లో, పాఠశాలల్లో న్యూట్రీ గార్డెన్ డ్రైవ్, ఆయుష్ ప్రాక్టీసుపై అవగాహన, వైవిధ్య భరితమైన పోషకాహార పదార్థాలపై అవగాహన కార్యక్రమాలు నిర్వహించబడుతాయని తెలిపారు.
పాఠశాల విద్యార్థులకు పోషణ, ఆరోగ్యంపై వివిధ పోటీలు, కుటుంబ సభ్యులకు సమావేశాలు, వంటల ప్రదర్శనలు వంటల పోటీలు, అన్నప్రాసన, సీమంతాలు మొదలగు కార్యక్రమాలుంటాయని తెలిపారు. జిల్లాలో నిర్వహించే కార్యక్రమాలు రోజు వారీగా జన్ ఆందోలన్ డాష్ బోర్డ్‌లో డేటా ఎంట్రీ చేయబడుతుందని తెలిపారు.
వైద్య ఆరోగ్యశాఖ, గ్రామీణాభివృద్ధి శాఖ, విద్యా శాఖ, పంచాయత్ రాజ్ తదితర సంబంధిత శాఖలు, ప్రజాప్రతినిధులు, స్వచ్చంధ సంస్థల సహకారంతో ఐసీడీస్ సిబ్బంది కార్యక్రమాలను నిర్వహిస్తారని ఆమె తెలిపారు.