నిజామాబాద్, సెప్టెంబర్ 1
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : బుధవారం నిజామాబాద్ నగరంలోని ఎన్టీఆర్ చౌరస్తా వద్ద నిజామాబాద్ ఎన్.ఎస్.యు.ఐ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ఎంపి అరవింద్ చిత్రపటానికి చెప్పుల దండ వేసి అరవింద్‌కు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ నిరసన వ్యక్తం చేశారు.
ఈ సందర్భంగా నిజామాబాద్ ఎన్‌ఎస్‌యుఐ జిల్లా అధ్యక్షుడు వరదబట్టు వేణురాజ్ మాట్లాడుతూ నిజామాబాద్ ఎంపీ అరవింద్, టి.పి.సి.సి అధ్యక్షుడు రేవంత్ రెడ్డిపై కాంగ్రెస్ పార్టీపై చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నామని, రేవంత్ రెడ్డి గురించి మాట్లాడేటప్పుడు కొంచెం నోరు అదుపులో పెట్టుకుని మాట్లాడాలని, రేవంత్ రెడ్డి మీలా రైతులకు తప్పుడు హామీలిచ్చి ఎంపీగా గెలవలేదని, ఆయన పోరాటపటిమను ప్రజల సమస్యల పట్ల ఆయనకున్న అవగాహనకు ప్రజా శ్రేయస్సు కొరకు అనునిత్యం అధికారపక్షంతో యుద్ధం చేయగలరని భావించి మల్కాజిగిరి ప్రజలు ఆయన లోక్ సభ సభ్యుడిగా ఎన్నుకున్నారని, అలాగే ఆయనకున్న నాయకత్వ లక్షణాలను గుర్తించి ఆయనకు పీసీసీ పదవి ఇచ్చారని నీలాగా తండ్రిని అడ్డం పెట్టుకుని టికెట్ తెచ్చుకునే రకం కాదు అని విమర్శించారు.
అసలు కాంగ్రెస్ పార్టీ కనుక మీ నాన్న డి శ్రీనివాస్‌కి ఎమ్మెల్యే పదవి, మంత్రి పదవి, పిసిసి అధ్యక్ష పదవి ఇవ్వకపోయి ఉంటే అసలు నువ్వు రాజకీయాల్లోకి వచ్చేవాడివా అని ప్రశ్నించారు. కాంగ్రెస్ పార్టీకి కార్యకర్తలు లేరని అభ్యర్థులే కరువయ్యారని, డబ్బులు ఖర్చు పెట్టి కార్యకర్తలను సభలకు తీసుకెళ్తున్నారని మాట్లాడుతున్నావు, కార్యకర్తలు ఉన్నది లేనిది అభ్యర్థులు ఉన్నది లేనిది వచ్చే ఎన్నికల్లో రుజువు అవుతుందని అప్పటిదాకా కొంచెం అరవింద్ ఓపిగ్గా ఎదురుచూడాలని, నిజామాబాద్ ప్రజలకైతే నువ్వు తప్పుడు హామీలు ఇచ్చి గెలిచావో అదే నిజామాబాద్ ప్రజలు వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని అత్యధిక మెజార్టీతో గెలిపిస్తారని ఆయన అన్నారు.
ఇంకోసారి రేవంత్ రెడ్డి గురించి గానీ కాంగ్రెస్ పార్టీ గురించి గానీ తప్పుగా మాట్లాడితే సహించేది లేదని ఈ సందర్భంగా ఆయన హెచ్చరించారు. కార్యక్రమంలో ఎన్‌ఎస్‌యుఐ నిజామాబాద్ జిల్లా ప్రధాన కార్యదర్శి వేద మిత్ర, అభిలాష్, చింటూ, సాయి చంద్, సతీష్, వంశీ, సన్నీ, నితిన్, ముషు పటేల్, తదితరులు పాల్గొన్నారు.