నిజామాబాద్, సెప్టెంబర్ 1
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : అన్ని పాఠశాలలో విద్యా సంస్థలలో విద్యార్థులు కోవిడ్ నిబంధనలు నూటికి నూరు శాతం పాటించాలని జిల్లా కలెక్టర్ సి.నారాయణ రెడ్డి తెలిపారు. బుధవారం నుండి విద్యాసంస్థలు తిరిగి ప్రారంభమైన నేపథ్యంలో ఆయన డిచ్‌పల్లి మండలం ధర్మారం గ్రామంలో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ప్రేయర్ కార్యక్రమంలో పాల్గొన్నారు.
ఈ సందర్భంగా కరోనాకు సంబంధించి ఆయన విద్యార్థులకు పలు సూచనలు చేశారు. భోజనం చేసే సమయంలో, నీరు తాగే సమయంలో మాత్రమే మాస్క్ తీయాలని, ఇతర సమయాల్లో మాస్క్ ధరించే ఉండాలని, ఇంటికి వెళ్ళి చేతులు శుభ్రం చేసుకున్న తర్వాత మాత్రమే దానిని తీయాలని తెలిపారు. ఎట్టి పరిస్థితిలో మాస్క్ తీసి మాట్లాడొద్దని సోషల్ డిస్టెన్స్ పాటించాలన్నారు.
రోజు తప్పకుండా ఉతికిన మాస్క్ వాడాలని తెలిపారు. స్కూల్లో ఉన్నంతసేపు జాగ్రత్తగా ఉండాలన్నారు. మాస్కులు లేనివారికి పిహెచ్‌సి నుండి తెప్పించి ఇవ్వాలని ప్రధానోపాద్యాయునికి తెలిపారు. కోవిడ్ సంబంధించి ఎట్టి పరిస్థితిలో కాంప్రమైజ్ కావద్దని గుంపులు గుంపులుగా విద్యార్థులు ఉండకూడదన్నారు. ఫిజికల్ క్లాసులు ప్రారంభమైనవి కాబట్టి విద్యార్థులు బాగా కష్టపడాలని, టీచర్లు చెప్పినవి శ్రద్ధగా వినాలని ఇప్పుడు కష్టపడితేనే సంవత్సరన్నర కాలం క్లాసులు జరగక పోవడం వల్ల జరిగిన నష్టాన్ని పూడ్చుకునే అవకాశం ఉంటుందని లేదంటే భవిష్యత్తులో ఇబ్బంది అవుతుందని సిస్టమేటిక్‌గా చదువుకోండని ఉద్బోధించారు.
ఈ సందర్భంగా కలెక్టర్ పాఠశాలలోని కిచెన్, టాయిలెట్స్, క్లాస్ రూమ్స్, పాఠశాల పరిసరాలు పరిశీలించారు. కిచెన్‌లో సిద్ధం చేస్తున్న మధ్యాహ్న భోజనం ఏర్పాట్లను పరిశీలించారు. పాఠశాల ఆవరణలో మొక్కలు లేకపోవడం గమనించి హెచ్‌ఎంకు మొక్కలు పెట్టించాలని తెలిపారు. పాఠశాలల్లోని విద్యార్థులకు శానిటైజర్, థర్మల్ స్క్రీనింగ్ నిర్వహించారు. కలెక్టర్ వెంట ట్రైనీ కలెక్టర్ మకరంద్, పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు ఉషశ్రీ, సర్పంచ్ మమత, ఎంపీడీవో సురేందర్, తహసిల్దార్ శ్రీనివాస రావు తదితరులు ఉన్నారు.