నిజామాబాద్, సెప్టెంబర్ 3
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల కార్మిక వ్యతిరేక కోడ్స్, విధానాలకు వ్యతిరేకంగా ఐ.ఎఫ్.టి.యు ఉద్యమ కార్యాచరణ విషయమై శ్రామిక భవన్, కోటగల్లీలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఐ.ఎఫ్.టి.యు రాష్ట్ర అధ్యక్షులు వనమాల కృష్ణ మాట్లాడారు.
కేంద్ర ప్రభుత్వ కార్మిక వ్యతిరేక విధానాలను నిరసిస్తూ ఈ నెల 29న ఐ.ఎఫ్.టి.యు నిర్వహించిన రాష్ట్ర సదస్సు జయప్రదం అయిందన్నారు. సదస్సులో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల కార్మిక వ్యతిరేక విధానాలకు నిరసిస్తూ ఉద్యమ కార్యాచరణ ప్రకటించిందన్నారు. ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేటీకరించడం ఆపివేయాలని, కార్మికుల హక్కులు కాలరాస్తూ మోడీ ప్రభుత్వం తీసుకొచ్చిన కార్మిక వ్యతిరేక 4 కోడ్‌లను రద్దు చేయాలని, సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం సమాన పనికి సమాన వేతనం అందజేయాలని, కాంట్రాక్టు కార్మికులను రెగ్యులరైజ్ చేయాలని తీర్మానించిందన్నారు.
అందులో భాగంగా ఈ నెల 6 నుండి 19 వరకు ప్రచారం, సభలు, సమావేశాలు జరపాలని, 29న లేబర్ ఆఫీసు ముందు భారీ నిరసన ప్రదర్శనలు చేయాలని రాష్ట్ర సదస్సు తీర్మానించిందన్నారు. వీటిని జయప్రదం చేయాలని కార్మిక లోకానికి పిలుపునిచ్చారు. విలేకరుల సమావేశంలో యూనియన్ అధ్యక్ష కార్యదర్శులు డి.రాజేశ్వర్, ఎం. వెంకన్న, ఎం. సుధాకర్, టి.విఠల్ తదితరులు పాల్గొన్నారు.