కామారెడ్డి, సెప్టెంబర్ 3
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : నేరాలకు పాల్పడే నిందితుల కొమ్ముకాసే పోలీస్ స్టేషన్ బెయిల్ విధానాన్ని వెంటనే రద్దు చేయాలని కామారెడ్డి బార్ అసోసియేషన్ డిమాండ్ చేసింది. ఈ సందర్భంగా శుక్రవారం ఈ కోర్టులోని బార్ అసోసియేషన్‌లో జరిగిన సమావేశంలో అధ్యక్షులు గజ్జల బిక్షపతి మాట్లాడుతూ, హైదరాబాదులోని నాంపల్లి క్రిమినల్ కోర్టు ఆవరణలో జరుగుతున్న న్యాయవాదుల దీక్షలకు కామారెడ్డి బార్ అసోసియేషన్ సంపూర్ణ మద్దతు ప్రకటించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నాంపల్లి క్రిమినల్ కోర్టులోని న్యాయవాదులే కాక రాష్ట్రంలోని నలుమూలల నుండి న్యాయవాదులు వచ్చి దీక్షలకు సంఫీుభావం ప్రకటించడంతో పోలీస్ స్టేషన్ బెయిల్ విధానం 41 ఎ క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ ఎంత దుర్వినియోగం అవుతుందో అద్దం పడుతుందన్నారు. నాన్ బెయిలబుల్ కేసులలో తీవ్రమైన ఆర్థిక నేరాల కేసులో కూడా నిందితులు పోలీస్ స్టేషన్‌లో బెయిల్ పొంది దర్జాగా తిరిగి ఆర్థిక నేరాలకు పాల్పడడం జరుగుతోందన్నారు.
జుడిషియల్ పవర్ పోలీసులు ఉపయోగించే 41 ఎ క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ వెంటనే కేంద్రం రద్దు చేయాలని ఆయన కోరారు. పార్లమెంటులో చట్ట సవరణ ద్వారా సుప్రీం కోర్టులో రివ్యూ పిటిషన్ ద్వారా ఇది సాధ్యపడుతుందని ఆయన పేర్కొన్నారు. నేరాలకు పాల్పడిన వారికి అనుకూలంగా ఉన్న ఈ సెక్షన్‌ను రాష్ట్రాలు కూడా సవరణలు చేసే అధికారం ఉందన్నారు.
పోలీస్ స్టేషన్ బెయిలు విధానాన్ని రద్దు చేసి, అన్ని రకాల బెయిల్ దరఖాస్తులు కోర్టు ద్వారానే పొందే విధంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కృషి చేయాలని ఆయన కోరారు. సమావేశంలో బార్ అసోసియేషన్ ప్రతినిధులు గోనెల జగన్నాథం, జోగుల గంగాధర్, దేవేందర్ గౌడ్, సూర్య ప్రసాద్, తదితరులు పాల్గొన్నారు.