నిజామాబాద్, సెప్టెంబర్ 7
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : మంగళవారం రోజంతా జిల్లాలో అతి భారీ వర్షాలు కురుస్తాయని సమాచారం ఉన్నందున జిల్లా యంత్రాంగం, ప్రజలు అత్యంత అప్రమత్తంగా ఉండాలని ఎప్పటికప్పుడు అవసరమైన జాగ్రత్తలు తీసుకోవాలని, ఫిర్యాదులపై వెంటనే స్పందించి సమస్యలు పరిష్కరించాలని, ప్రజల రక్షణకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలని ప్రతి అధికారి తప్పనిసరిగా హెడ్ క్వార్టర్‌లో ఉండాలని మంగళవారం జిల్లాలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేటు విద్యా సంస్థలకు లోకల్ హాలిడే ప్రకటించడం జరిగిందని, నిజాంసాగర్ పోచంపాడు ప్రాజెక్టుల కింద లోతట్టు ప్రాంతాల ప్రజలను అప్రమత్తం చేసి వారిని అవసరమైతే సురక్షిత ప్రాంతాలకు తరలించాలని పై నుండి వస్తున్న ఇన్-ఫ్లోకు అనుగుణంగా చెరువులు, ప్రాజెక్టుల నుండి ఔట్-ఫ్లో ఏ మేరకు ఉండాలో అందుకు అనుగుణంగా చర్యలు తీసుకోవాలని ఎక్కడైనా రహదారులు దెబ్బతింటే వెంటనే మరమ్మతులు చేయించాలని, విద్యుత్ సరఫరా లోపం జరిగితే వెంటనే పునరుద్ధరించాలని సంబంధిత అధికారులను జిల్లా కలెక్టర్ నారాయణ రెడ్డి ఆదేశించారు.
జిల్లాలో సోమవారం నుండి ఎడతెరిపి లేకుండా భారీగా కురుస్తున్న వర్షాలను దృష్టిలో పెట్టుకొని మంగళవారం ఉదయం క్యాంపు కార్యాలయం నుండి అధికారులతో అత్యవసర సెల్ కాన్ఫరెన్సు నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, ప్రస్తుతం కురుస్తున్న భారీ వర్షాల వల్ల చెరువులు, కుంటలు తెగిపోయే అవకాశం ఉన్నందున నీటిపారుదలశాఖ అధికారులు వారి సిబ్బందిని అప్రమత్తం చేయాలని ఆదేశించారు. నిజాంసాగర్ ప్రాజెక్టు మంగళవారం ఏ సమయంలోనైనా పూర్తిస్థాయి నీటి మట్టానికి చేరుకోవడానికి అవకాశం ఉందని తద్వారా గేట్లు ఎత్తవచ్చని దానితో క్రింది స్థాయి ప్రాంతాలలో ప్రజలకు ఇబ్బందులు తలెత్తకుండా అప్రమత్తం చేయాలని ఆదేశించారు.
పోచంపాడు ప్రాజెక్టుకు కూడా పై నుండి పెద్ద మొత్తంలో నీటి ప్రవాహం ఉన్నందున ప్రాజెక్టులో పూర్తిస్థాయి కాకుండా తక్కువగానే నీటి నిలువ ఉంచుకొని వస్తున్న ప్రవాహానికి అనుగుణంగా క్రిందికి గేట్ల ద్వారా నీటిని వదిలి అన్ని ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు. సర్పంచులు, పంచాయతీ కార్యదర్శులు తప్పనిసరిగా గ్రామాల్లోనే ఉండి ఎప్పటికప్పుడు పరిస్థితిని గమనించాలని అవసరమైతే మండల స్థాయి, జిల్లా స్థాయి అధికారులకు సమాచారం అందించాలని పేర్కొన్నారు.
మున్సిపాలిటీలు, విద్యుత్తు, ఆర్‌డివోలు తదితర ప్రధాన శాఖల అధికారులు కంట్రోల్ రూమ్‌లు ఏర్పాటు చేసి ప్రజలు ఫిర్యాదు చేసే విధంగా సిబ్బంది 24 గంటలు అందుబాటులో ఉండి ఫిర్యాదులను స్వీకరించే విధంగా, వెంటవెంటనే సంబంధిత శాఖలకు సమాచారం అందించే విధంగా ఏర్పాటు చేసుకోవాలని ఒక సీనియర్ అధికారిని ఇన్చార్జిగా నియమించాలని, ప్రతి కాల్‌ను అధికారులు పర్యవేక్షించాలని ఆదేశించారు.
గ్రామ పంచాయతీలు, మున్సిపాలిటీలలో అవసరమైతే అదనంగా లేబర్‌ను, మిషనరీని ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. ఆర్‌డివోలు, తహసిల్దార్‌లు విపత్తు నిర్వహణ బాధ్యులనీ, సంబంధిత అధికారులతో సమన్వయం చేసుకొని ఎప్పటికప్పుడు పరిస్థితులను చక్కదిద్దాలని ఆదేశించారు. కాన్ఫరెన్సులో అదనపు కలెక్టర్లు చంద్రశేఖర్, చిత్రా మిశ్రా, ఇరిగేషన్ సిఇ, ఆర్డీవోలు, ట్రాన్స్‌కో ఎస్‌ఇ, పంచాయతీ రాజ్ ఆర్‌అండ్‌బి అధికారులు, డిపిఓ, తదితరులు పాల్గొన్నారు.