ఆర్మూర్, సెప్టెంబర్ 12
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ప్రగతిశీల యువజన సంఘం పివైఎల్ ఆధ్వర్యంలో డెంగీ విష జ్వరాలు తీవ్రంగా ప్రబలుతున్న నేపధ్యంలో వాటిని అరికట్టడానికి వైద్య సదుపాయాలు ఏ మేరకు చేపడుతున్నారు, అట్లాగే ఆర్మూర్ ప్రభుత్వఆసుపత్రిలో సమస్యలపై సర్వే నిర్వహించారు. ఈ సదర్భంగా పివైఎల్ రాష్ట్ర నాయకులు సుమన్ మాట్లాడుతూ డెంగీ జ్వరాలు తీవ్రంగా పెరుగుతున్నాయని ప్రజలు తమ ఇంటిని, అట్లాగే పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు.
మున్సిపల్ అదికారులు సిబ్బందిని పెంచి పట్టణంలో గల వీధులన్నీ శుభ్రంగా ఉంచేలా, అట్లాగే ఇంటింటికి రసాయనాల పిచికారీ చేపట్టాలని, దోమలను అరికట్టడానికి వీధుల్లో ప్రతి రోజూ ఫాగింగ్ చేయించాలని అన్నారు. ప్రభుత్వ ఆసుపత్రిలో కేవలం డెలివరీ కేసులకు మాత్రమే అడ్మిషన్ ఉందని డెంగీ లాంటి విష జ్వరాలు ఇతర విషమ పరిస్తితిలో రోగులు వస్తే అడ్మిట్ సౌకర్యం లేక ప్రైవేటు ఆసుపత్రులకు వెళ్తున్నారన్నారు.
సర్వే సందర్భంలో రోగుల కుటుంబ సభ్యులు ఇక్కడ జరుగుతున్న ఇబ్బందులను తమకు తెలియజేశారన్నారు. ప్రధానంగ ఇక్కడ ఆపరేషన్ చేస్తే కుట్లను వేసే దారం మొదలుకుని ప్లాస్టర్లు మందులు ఇంజెక్షన్లు బయట మెడికల్ నుండి కొనుక్కుంటున్నట్లు తెలిపారు. ఇలా అయితె ప్రభుత్వ ఆసుపత్రికి వచ్చి ఉపయోగం ఏమిటని తమ ఆవేదన వ్యక్తం చేశారన్నారు. ఈ విషయమై సూపరింటెండెంట్ నాగరాజుతో ఫోన్‌లో సంప్రదించగా గత కొంత కాలంగా ఎమర్జెన్సీ డ్రగ్ సప్లై లేకపోవడంతో ఇబ్బంది ఉందని చెప్పారన్నారు.
ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రస్తుత డిప్యూటీ డీఎంహెచో రమేష్ లాంటి వాళ్ల చొరవ వల్ల డిప్యుటెషన్ పై సిబ్బందిని తెప్పించుకుని డెలివరీ కేసులు పెంచేలా వైద్య సేవలు అందిస్తున్నా పాలకుల నుండి సౌకర్యాల కల్పనలో సిబ్బందిని భర్తీ చేయటంలో నిర్లక్ష్యం మూలంగా ఆశించిన ఫలితాలు రావట్లేదనేది తమ పరిశీలనలో అర్థం అవుతుందని అన్నారు.
డెంగీ విషజ్వర పరిస్థితుల్లో ప్రయివేటు ఆసుపత్రులు, ఆర్‌ఎంపి, పిఎంపిల వద్ద జనం కిటకిటలాడుతున్నారని, ప్రభుత్వ ఆసుపత్రిలో డాక్టర్లు, సిబ్బంది, మౌలిక సదుపాయాలు పూర్థిస్థాయిలో కల్పించి ప్రజల్లో నమ్మకం కల్పిస్తే ప్రజలు ప్రభుత్వ ఆసుపత్రి వైపు చూస్తారని అన్నారు. ప్రభుత్వ ఆసుపత్రి అభివృద్దికి సౌకర్యాల కల్పన కై పివైఎల్ ఆధ్వర్యంలో పోరాడుతామని అన్నారు. కార్యక్రమంలో పివైఎల్ ఆర్మూర్ డివిజన్ అధ్యక్షుడు రాకేష్, కార్యదర్శి నిఖిల్, మనోజ్, సలీం పాల్గొన్నారు.