నిజామాబాద్, సెప్టెంబర్ 13
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని లోతట్టు ప్రాంతాల్లో సిసి రోడ్లు, స్వచ్ఛమైన తాగునీరు, డ్రైనేజీ వ్యవస్థ, ఇతర మౌలిక సదుపాయాలు కల్పించాలని, రియల్ ఎస్టేట్ వ్యాపారుల కబ్జాల నుండి ప్రభుత్వ స్థలాన్ని కాపాడాలని డిమాండ్ చేస్తూ ఐఎఫ్‌టియు, పివోడబ్ల్యు, పిడిఎస్‌యు, పివైఎల్ సంఘాల ఆధ్వర్యంలో జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు నిరసన వ్యక్తం చేసి కలెక్టర్‌కి వినతి పత్రం అందజేశారు.
ఈ సందర్భంగా పీ.వో.డబ్ల్యూ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు వి.గోదావరి, కే.సంధ్యరాణి, ఐ.ఎఫ్.టీ.యూ జిల్లా నాయకులు ఎం.సుధాకర్ మాట్లాడుతూ నిజామాబాద్ మున్సిపాలిటీ మున్సిపల్ కార్పొరేషన్ గా ఆవిర్భవించి దశాబ్దకాలం పైనే అవుతున్నదని కానీ, ఇప్పటికీ ప్రజలకు కనీస మౌలిక సదుపాయాలు కూడా కరువయ్యాయన్నారు. ముఖ్యంగా వర్షాకాలంలో లోతట్టు ప్రాంతాలు, నగర శివారు ప్రాంతాల్లో పరిస్థితులు అత్యంత దారుణంగా ఉంటున్నాయన్నారు.
ఇటీవల కురిసిన వర్షాలకు నగర డ్రైనేజీ వ్యవస్థ డొల్లతనం బయటపడిరదన్నారు. విలీన గ్రామాల సౌకర్యాల గురించి పట్టించుకునే పరిస్థితి లేదన్నారు. మున్సిపల్ కార్పొరేషన్ టాక్సులు వసూలు చేయడంలో చూపిస్తున్న శ్రద్ధ, సౌకర్యాలు కల్పించడంలో చూపడం లేదన్నారు. కార్పొరేషన్ పరిధిలో గాయత్రి నగర్, సాయినగర్, సీతారాంనగర్ కాలనీ, నాగారం, 300, 50 క్వార్టర్స్, కంటేశ్వర్, చంద్రశేఖర్ కాలనీ, గాజులపేట, కెనాల్ కట్ట, అర్సపల్లి, మాలపల్లి, అహ్మ్మద్ పుర కాలనీ, ఖిల్లా ఈద్గా, కోజా కాలనీ, అంబేద్కర్ కాలనీ, దుబ్బా, గౌడ్స్ కాలనీ తదితర ప్రాంతాలు వర్షాలు పడితే డ్రైనేజీ వ్యవస్థ సరిగా లేక మురుగునీరు ఇళ్లలోకి వచ్చి ప్రజలకు తీవ్ర ఇబ్బందులు అవుతున్నాయన్నారు.
అండర్ గ్రౌండ్ డ్రైనేజీ వ్యవస్థ పనులు ప్రారంభించి ఏళ్లు గడుస్తున్నా ఇప్పటికీ అసంపూర్తిగా మిగిలాయన్నారు. భారీ వర్షాలు పడితే శివారు ప్రాంతాలు, లోతట్టు ప్రాంతాల్లో జీవిస్తున్న ప్రజల బాధలు వర్ణనాతీతమన్నారు. వెంటనే ప్రభుత్వం, మున్సిపల్ కార్పొరేషన్, జిల్లా అధికారులు లోతట్టు, శివారు ప్రాంతాల్లో మొన్నటి వర్షాలకు నీట మునిగిన ప్రాంతాలపై దృష్టి సారించాలని, డ్రైనేజీ వ్యవస్థను బాగు చేయాలని డిమాండ్ చేశారు. లీకేజీలను అరికట్టి ప్రజలకు స్వచ్ఛమైన తాగునీరు అందేలా చర్యలు తీసుకోవాలన్నారు.
ప్రభుత్వ స్థలాలను కబ్జా చేస్తున్న రియల్ ఎస్టేట్ వ్యాపారుల ఆగడాలను నివారించాలన్నారు. నగరంలో ఇళ్ళు లేని పేదలకు నివాస స్థలాలు, ఇంటి నిర్మాణ సౌకర్యం కల్పించేలా కార్యాచరణ ప్రారంభించాలని డిమాండ్ చేశారు. పై విషయాల పట్ల తగు చర్యలు తీసుకోవాలని, లేనిచో పెద్ద ఎత్తున ఆందోళనలు చేపడతామన్నారు. కార్యక్రమంలో జిల్లా పీ.డీ.ఎస్.యూ జిల్లా అధ్యక్షురాలు కల్పన, వివిధ ప్రజా సంఘాల నాయకులు విటల్, నర్సక్క, గోవర్ధన్, ప్రత్యూష, గోపి, శివకుమార్, లక్ష్మణ్, అశోక్, సాయిలు, గంగమణి, నరేందర్ తదితరులు పాల్గొన్నారు.