నిజామాబాద్, సెప్టెంబర్ 13
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : సోమవారం నిజామాబాద్ నగరంలోని జిల్లా కాంగ్రెస్ భవన్‌లో ఎన్‌ఎస్‌యుఐ నిజామాబాద్ జిల్లా అధ్యక్షుడు వరదబట్టు వేణురాజ్ ఆధ్వర్యంలో ఎన్‌ఎస్‌యుఐ నిజామాబాద్ జిల్లా కమిటీ సమీక్ష సమావేశం నిర్వహించారు. ముఖ్య అతిథిగా ఎన్.ఎస్.యు.ఐ నిజామాబాద్ జిల్లా ఇంచార్జ్ గొల్ల జాన్ హాజరయ్యారు. హైదరాబాద్‌లో అత్యాచారానికి గురై హత్య చేయబడ్డ ఆరు సంవత్సరాల బాలిక చైత్రకు నివాళులర్పించి అనంతరం నిజామాబాద్ నగరంలోని ఎన్టీఆర్ చౌరస్తా వద్ద బిజెపి ప్రభుత్వం చేస్తున్న ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా నిరసన వ్యక్తం చేశారు. భారతమాత చిత్రపటానికి పూలమాలవేసి బిజెపి నాయకుల కళ్ళు తెరిపించాలని కోరారు.
ఎన్.ఎస్.యు.ఐ నిజామాబాద్ జిల్లా అధ్యక్షుడు వరదబట్టు వేణురాజ్ మాట్లాడుతూ బిజెపి నాయకులు పొద్దున లేస్తే భారత్ మాతాకీ జై, దేశం కోసం ధర్మం కోసం అంటూ ఉపన్యాసాలు ఇస్తారు కానీ దేశ సంక్షేమం పట్ల వారికి ఎలాంటి చిత్తశుద్ధి లేదని ఒకవేళ ఉండి ఉంటే ఇలా ప్రభుత్వ ఆస్తులను ప్రైవేట్ వ్యక్తులకు అమ్మేవారు కాదని, మోడీ ప్రభుత్వం పరిపాలన చేతకాకపోతే ఇంట్లో కూర్చోవాలి తప్ప ఇలా పనికిమాలిన నిర్ణయాల వల్ల దేశ భవిష్యత్తు అంధకారంలో పడిపోతుందని ఆయన అన్నారు.
బిజెపి ప్రభుత్వం దేశం కోసం ధర్మం కోసం పనిచేయడం లేదని దేశంలోని ధనవంతులు రక్షణ కోసం పని చేస్తుందని ఆయన ఎద్దేవా చేశారు. అనంతరం గొల్ల జాన్ మాట్లాడుతూ అసలు బీజేపీ ప్రభుత్వం మొదటి నుండి కార్పొరేట్ కంపెనీలు చెప్పిన విధంగానే చేస్తుందని ఇప్పుడు ఏకంగా దేశాన్ని కార్పొరేట్ పరం చేయాలని మోడీ కంకణం కట్టుకున్నారని బిజెపి నాయకులు పొద్దున లేస్తే కాంగ్రెస్ ఏం చేసిందని విమర్శిస్తారు, ఇప్పుడు మీరు అమ్ముతున్న ఎయిర్ పోర్ట్‌లు రైల్వేలు, రైల్వే స్టేషన్లు, టెలికాం కంపెనీలు, హైవేలు, బీమా కంపెనీలు అన్నీ కూడా కాంగ్రెస్ హయాంలో ఏర్పడ్డాయని గ్రహించాలని ఆయన అన్నారు.
ఒకపక్క ప్రభుత్వ ఆస్తులను అమ్ముతూ మరోపక్క పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరను పెంచి దేశ ప్రజల జీవితాలను చిన్నాభిన్నం చేస్తున్నారని, బిజెపి ప్రభుత్వం దేశ భవిష్యత్తును అంధకారంలోకి నెట్టుతుందని ముఖ్యంగా బిజెపి తీసుకునే నిర్ణయాల వల్ల భవిష్యత్తులో అసలు ప్రభుత్వ రంగం ఉంటుందో లేదో అనే ఆందోళన వ్యక్తమవుతోందని, యువతకు ప్రభుత్వ ఉద్యోగాలు దక్కుతాయో లేదో కూడా అనుమానమేనని అన్నారు.
కేవలం దేశంలోని కొంతమంది వ్యక్తుల కోసం దేశ సంపదనంతా వారికి కట్టబెడుతున్నారని, అధికారంలో ఉన్నామని దేశ సంపదను అమ్మితే కాంగ్రెస్ గానీ కాంగ్రెస్ నాయకులు చూస్తూ ఊరుకోమని ఈ అడ్డగోలు అమ్మకాలపై ప్రజలందరినీ ఏకం చేసి మీయొక్క అవినీతిని ఎండగడతామని ఆయన స్పష్టం చేశారు.
ఇకనైనా ప్రభుత్వ ఆస్తులను ప్రైవేట్ వ్యక్తుల పరం చేసే ఆలోచనలు మానుకోవాలని లేని పక్షంలో వచ్చే ఎన్నికల్లో ప్రజలు బిజెపికి తగిన బుద్ధి చెబుతారని ఆయన అన్నారు. కార్యక్రమంలో ఎన్.ఎస్.యు.ఐ జిల్లా ఉపాధ్యక్షుడు సాయి వరుణ్, జిల్లా ప్రధాన కార్యదర్శులు భాను, వేద మిత్ర, అఖిల్, నాయకులు తదితరులు పాల్గొన్నారు.