కామారెడ్డి, సెప్టెంబర్ 14
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : తెలంగాణ యూనివర్సిటీ పరిధిలో నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తున్న బి.ఎడ్ కళాశాలలకు 2021- 21 విద్యాసంవత్సరానికి అనుమతులు ఇవ్వరాదని టిఎన్‌ఎస్‌ఎఫ్ రాష్ట్ర కార్యదర్శి బాలు, తెలంగాణ జన సమితి రాష్ట్ర నాయకులు కుంభాల లక్ష్మణ్ యాదవ్ విసీ, రిజిస్టర్‌ల దృష్టికి తీసుకువచ్చారు. చాలా కళాశాలల్లో ఎన్‌సిటిఇ నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తున్నాయని 100 మంది విద్యార్థులకు 17 మంది అధ్యాపకులు ఉండాల్సి ఉండగా కేవలం ముగ్గురు లేదా నలుగురు అధ్యాపకులతో కళాశాలలు నిర్వహిస్తున్నాయని తెలిపారు.
తెలంగాణ రాష్ట్రంలో ఒక వైపు ఉద్యోగాలు లేక నిరుద్యోగులు ఆత్మహత్యలు చేసుకుంటే ప్రైవేటు బి.ఎడ్ కళాశాలల అధ్యాపకులు లేకుండానే లక్షలాది రూపాయలను ప్రభుత్వం నుండి విద్యార్థుల నుండి వసూలు చేసి విద్యా వ్యవస్థ సర్వనాశనం చేస్తున్నారన్నారు. ఇలాంటి కళాశాలలకు ఈ విద్యాసంవత్సరం అనుమతులను నిలిపివేయాలని లేకపోతే విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో ఆందోళన ఉధృతం చేస్తామన్నారు.
యూనివర్సిటీ అధికారులు తనిఖీలు చేస్తున్నప్పుడు విద్యార్థి సంఘాలు కూడా వెంట వస్తామని వాస్తవాలను ప్రత్యక్షంగా తెలియజేస్తామన్నారు. కార్యక్రమంలో బిసి యువజన సంఘం జిల్లా అధ్యక్షుడు చేట్టబోయిన స్వామి, నాయకులు కాశా గౌడ్, రాజు, సందీప్, సతీష్, మధు, శరత్ పాల్గొన్నారు.